ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవోల మద్దతు

బుధవారం, 16 అక్టోబరు 2019 (08:14 IST)
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. టీఎన్జీవో భవన్ లో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తూ సమావేశం తీర్మానించింది. అలాగే ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు దూతగా టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డిని సీఎం వద్దకు పంపాలని నిర్ణయిస్తూ తీర్మానం చేసింది. అలాగే ఆర్టీసీ కార్మికులను తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించింది.
 
ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు
తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. వారు నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో  టీఎన్జీవో,టిజిఓ నాయకులతో సమావేశమయ్యారు. ఆర్టీసీని రక్షించుకోవడానికి తాము సమ్మె చేస్తున్నామని చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సమయం వస్తుందని తాము అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సకల జనుల సమ్మెలో కలిసి పాల్గొన్నామని అన్నారు. 2400 కోట్లు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సి ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉన్నాయని, అయినా కష్టపడుతున్నామని అన్నారు. 

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే సమ్మెకు దిగామన్నారు. ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోవడం తమను కలిచివేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం  జీతాలు ఇచ్చిందన్నారు.  మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాము సమావేశమైనప్పుడు చాలా అపోహలు కలిగాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు