బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ సరికొత్త ఎత్తుగడ..!?

సోమవారం, 29 మార్చి 2021 (03:47 IST)
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన హనుమాన్‌ చాలిసా పారాయణం అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. బీజేపీ జైశ్రీరామ్ నినాదంతో దూసుకెళ్తోంది. ఇటీవలే రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు. ఊరూరా జైశ్రీరామ్ నినాదం మార్మోగింది.

అదే నినాదంతో తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టింది. ఈ క్రమంలో బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదాన్ని అందుకుందనే ప్రచారం జరుగుతోంది.
 
రాష్ట్రవ్యాప్తంగా 82 రోజుల పాటు హనుమాన్ చాలిసా పారాయణం సాగించాలని టీఆర్‌ఎస్‌ పెద్దలు ప్లాన్ చేశారు. ఇందుకోసం అన్ని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల కాశీ తీర్థయాత్రలకు వెళ్లారు.

అక్కడ పూజారులు రామకోటి స్తూపం ఎంతో మహిమ గలదని ఆమెకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 9న ఆమె కొండగట్టుకు వెళ్లి రామకోటి స్తూపానికి ఉత్తరద్వారంలో భూమి పూజచేశారు.

ఈ నెల 17న అఖండ పారాయణంలో భాగంగా.. కొండగట్టు వై జంక్షన్ నుంచి దేవస్థానం వరకు కవిత శోభాయాత్రగా వెళ్లారు. శ్రీ రామకోటి ప్రతులను స్వామి వారి ముందు పెట్టి పూజలు చేశారు. అనంతరం అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు.
 
హనుమాన్ పారాయణంపై కవిత నిరంతరం హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..హనుమాన్ చాలిసా పారాయణంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న టీఆర్‌ఎస్‌కు 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో సిట్టింగ్ స్థానాలు గులాబీ పార్టీ కోల్పోయింది. బీజేపీ పుంజుకున్న విధానం అధికార పార్టీకి కంట్లో నలుసులా తయారు అయ్యింది.

అందుకే బీజేపీ తరహాలో హిందూత్వ నినాదాన్ని టీఆర్‌ఎస్‌ అందుకుని హనుమాన్ చాలిసా పారాయణం చేపట్టినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొండగట్టు హనుమాన్ దేవాలయం అభివృద్ధిపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు