నిరాశలో మేయర్ బొంతు రామ్మోహన్... ఫోన్ స్విచ్చాఫ్

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:01 IST)
ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ అలకబూనారు. ఉప్పల్ అసెంబ్లీ సీటుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుభాష్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. 2014 ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని  ఆకాంక్షించినా పార్టీ ఆదేశాలు మేరకు  చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీచేసి మేయర్ పదవి చేపట్టారు బొంతు రామ్మోహన్.
 
చర్లపల్లి డివిజెన్ ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోనిది కావడంతో అక్కడ నుంచి పోటీ చేయడాని బొంతు రామ్మోహన్ నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. మేయర్‌గా ఉన్నప్పటికీ ఉప్పల్‌ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్ఠి సారించేవారు. బీజేపీ  ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్ ప్రభాకర్ ఉప్పల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే  తాజాగా కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో ఉప్పల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2014లో పోటీ చేసి ఓడిపోయిన భేతి సుభాష్ రెడ్డి పేరు ఖరారైంది. 
 
జాబితా ప్రకటించిన వెంటనే మేయర్‌ నిరాశకు గురయ్యారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అందుకే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి మేయర్‌ డుమ్మా కొట్టడంతో పాటు మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసి పార్టీ వర్గాలకూ అందుబాటులోకి రాలేదంటున్నారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో రామ్మోహన్‌ కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు సన్నిహిత అనుచరుడిగా పేరుపడ్డ రామ్మోహన్‌కు ఏమేరకు అవకాశం లభిస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు