చెర్రీ మోసం చేశారు... మాకు న్యాయం చేసి 'సైరా'ను విడుదల చేయండి: హైకోర్టులో పిటీషన్

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (19:44 IST)
హైదరాబాద్ : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో వ్యాపారం చేస్తున్న సినీ హీరో రాంచరణ్ తమను మోసం చేశాడని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఆరోపించారు. సైర నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుండి సమాచారం తీసుకొని ఇప్పుడు మొఖం చాటేశరని వారు అన్నారు. సోమవారం హైదర్‌గూడ లోని ఎన్ఎస్ఎస్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి సేవ సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారని, చిరంజీవి, రామ్ చరణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. వారు ఇచ్చి మాట తప్పారని, న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వారు పేర్కొన్నారు.
 
ఈ ఫిటీషన్లో బాద్యులుగా రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్, చిత్ర హీరో  చిరంజీవి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలను చేర్చినట్లు తెలిపారు. చిత్ర ప్రారంభంలో తమను ఇంటికి పిలిపించుకుని తమతో రాంచరణ్ సంతకాలు తీసుకొని, ఆయన చరిత్రను తెలిపినందుకు వారసులుగా తమకు కొంత డబ్బు చెల్లిస్తానను మాట ఇచ్చారని వారు అన్నారు. ఇప్పుడు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నాక తమకు ఇచ్చిన మాటను తప్పి తమకు సిటీ సివిల్ కోర్ట్ నుండి నోటీసులు పంపించారని తెలిపారు.
 
ఇప్పటికైనా నిర్మాత రాంచరణ్, హీరో చిరంజీవిలు స్పందించి తమకు ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలని, చిత్రం విడుదలకు ముందే వారసుల ముందు చిత్రాన్ని ప్రదర్శించాలని కోరారు. లేని పక్షంలో చిత్రం విడుదల రోజునే ఆయన వారసులమైన తాము చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్యలు చేసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దస్తగిరి రెడ్డి, లక్ష్మీ కుమారి, సాంబశివ రెడ్డి, జయరాం రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు