కాంగ్రెస్ నేతలకు, తనకు మధ్య వివాదాలు నెలకొన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని, తమను వేరు వేరుగా చూడొద్దని ఎంపీ అన్నారు. తమ నాయకులు చేసే పాదయాత్రలకు తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు.
త్వరలోనే తెలంగాణలోని ప్రతీ పల్లెను, గుండెను, గూడెంను చుట్టేయనున్నట్లు చెప్పారు. తన దగ్గర వ్యూహం, ఎత్తుగడ ఉందని తెలిపారు. అధిష్టానం అనుమతి తీసుకుంటానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని తెలిపారు. పాదయాత్రలో తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞుడిగా ఉంటానని అన్నారు. చాలా మంది ప్రజలను కలువలేక పోయాను.. క్షమించాలని కోరారు.
ఫార్మసీటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కందుకూరు, కడ్తల్‌లో ఫార్మసిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీదపెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.