టీఆరెస్ పై చర్యలేవి?... ఈసీ వ్యవహారంపై రేవంత్ విస్మయం
శనివారం, 25 జనవరి 2020 (18:10 IST)
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా తమకు తెలిసిపోతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ చేసినా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పలానా పార్టీకి ఓటేశానని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్‌పై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ కేటీఆర్ బ్లాక్‌మెయిల్ చేశారని అన్నారు.
నామినేషన్ల సమయంలో పార్టీ టికెట్లు అమ్ముకున్న మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై ఈసీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు ఎందుకు అచేతనంగా ఉన్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. 25 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీకి 50శాతం సీట్లు కూడా రాలేదన్నారు.
రాజ్యాంగాన్ని మంట కలిపిన ఘనత కేసీఆర్ దే: విజయశాంతి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారని విమర్శించారు.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో, ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెట్టే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని.. ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను లోబర్చుకోవడం కేసీఆర్ అండ్ కోకు కొత్తేమి కాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారికి మంత్రి పదవులు ఇచ్చి, రాజ్యాంగాన్ని మంట కలిపిన ఘనత కూడ కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రహసనం... జడ్పీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన అభ్యర్థులను కొనడంతో పాటు, చివరకు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన ప్రతిపక్షానికి చెందిన ప్రతినిధుల వరకూ లొంగదీసుకొనే ప్రక్రియ కొనసాగుతూనే ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఓటర్ల ఆలోచన విధానాన్ని సీఎం.. ఎంతగా కలుషితం చేశారంటే... ఓటు వేసి గెలిపించినా... ఫలితాలు వచ్చిన తర్వాత వారు కూడా ప్రలోభాలకు లొంగి, టీఆర్ఎస్‌లో చేరతారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. దీంతో ఇతర పార్టీలకు ఓటు వేయడం కంటే టిఆర్ఎస్‌కు ఓటు వేయాలన్న ఆలోచన వాళ్లలో కలిగే విధంగా టీఆర్ఎస్ నాయకత్వం ఓ దుస్సాంప్రదాయానికి తెరలేపిందన్నారు.
ఇలాంటి ఎత్తులు, జిత్తులు వేయడంలో సీఎం దిట్ట అయ్యుండొచ్చు కానీ... గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ఇచ్చిన హామీలలో ఎన్నిటిని అమలు చేశారనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం దొరకదన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే భయంతోనే ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఉంటారన్న విమర్శ కేసీఆర్‌పై ఉందని విజయశాంతి తెలిపారు.
తనకు తిరిగే లేదన్న అహంకారంతో దూసుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు, గత పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం తర్వాత అయినా మార్పు వస్తుందని తెలంగాణ ప్రజానీకం ఆశించిందని తెలిపారు. కానీ, నవ్విపోదురుగాక... అన్న చందంగా ఎవరేమనుకున్నా సీఎం తన వైఖరిని మార్చుకోవడం లేదన్నారు.
కనీసం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కేసీఆర్.. మైండ్‌సెట్ మారుతుందని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి ఆశలు ఎండమావులుగా మారకూడదని కోరుకుంటున్నానని తెలిపారు.