'అరుంధతి'తో అనుష్కకు వచ్చింది... 'అంగుళీక'తో నాకొస్తుంది... ప్రియమణి

బుధవారం, 5 డిశెంబరు 2012 (18:03 IST)
WD
ప్రియమణి, 'సంపంగి, ప్రేమలో పావని కళ్యాణ్‌, అరుంధతి' వంటి హిట్‌ చిత్రాల హీరో దీపక్‌ జంటగా ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీ శంఖుచక్ర ఫిలింస్‌ పతాకంపై ప్రేమ్‌ ఆర్యన్‌ దర్శకత్వంలో కోటి తూముల, సి.హెచ్‌.రాంబాబు నిర్మాతలుగా రూపొందిస్తున్న చిత్రం 'అంగుళీక' చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు డిసెంబర్‌ 5న సంస్థ కార్యాలయములో జరిగాయి.

ఈ సందర్భంగా హీరోయిన్‌ ప్రియమణి మాట్లాడుతూ - ''ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో ఒక టిపికల్‌ క్యారెక్టర్‌ ఇది. ప్రతి హీరోయిన్‌కి తన కెరీర్‌లో చెప్పుకోవడానికి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే వుంటాయి. నాకు అవార్డులు వచ్చిన చిత్రాలు ఒక ఎత్తు అయితే, ఈ చిత్రంలో పాత్ర మరో ఎత్తు. అంత గర్వంగా చెప్పుకోగలిగే పాత్ర ఇది. 'అరుంధతి' చిత్రంతో అనుష్కకు ఎంత పేరొచ్చిందో నాకు ఈ చిత్రం ద్వారా అంతే పేరు వస్తుంది. ఈ చిత్ర దర్శకుడుకి ఇది మొదటి చిత్రమైనా, నా పాత్ర మలిచిన తీరు అద్భుతం. అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాను'' అన్నారు.

హీరో దీపక్‌ మాట్లాడుతూ - ''ఇప్పటివరకు నేను లవర్‌బోయ్‌ పాత్రల్లో ఒక అందమైన అబ్బాయిగా పలు చిత్రాల్లో నటించాను. హిందీ చిత్రాల్లో బిజీగా వుండటం వలన తెలుగు చిత్రాలు చేయలేకపోయాను. ఇన్నాళ్ళకు నాకు మళ్ళీ తెలుగులో మంచి పాత్ర లభించింది. ఆరువందల సంవత్సరాల క్రితం జరిగే కథ ఇది. అందులో నా పాత్ర రాబిన్‌హుడ్‌లాంటి ఒక యోధుడి పాత్ర. యువరాణిని ప్రేమించే ప్రేమికుడి పాత్ర. 'అరుంధతి' చిత్రంలో లాగా గెస్ట్‌రోల్‌ మాత్రం కాదు. సినిమా ఆద్యంతం నా పాత్ర వుంటుంది. ఈ పాత్ర నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు ప్రేమ్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ - ''ఆరువందల సంవత్సరాల క్రితం జరిగే కథలో కాలచక్రంతో ముడిపడి వున్న ఇరువురి ప్రేమికుల కథ. జన్మాంతరాలు దాటి సాగే ఆత్మబంధాల ప్రేమ ప్రయాణంలో ప్రతి జన్మ ఓ మజిలీ. ఆ ప్రేమ జంటకు ఓ దుష్ఠాత్మ వలన విఘాతం ఎదురైతే ప్రళయంగా మారిన ప్రణయపు కథే ఈ అంగుళీక'. నేను హిందీ దర్శకుడు మణిశంకర్‌ వద్ద రెండు సినిమాలకు పని చేశాను. తెలుగులో కూడా దర్శకత్వశాఖలో ఐదు చిత్రాలకు పని చేశాను. స్వతహాగా నేను చిత్రకారుణ్ణి, యానిమేటర్‌ అయినందున నా మొదటి చిత్రం విజువల్‌ వండర్స్‌ క్రియేట్‌ చెయ్యాలని ఈ కథను ఎన్నుకున్నాను'' అన్నారు.

నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ - ''దీపక్‌, ప్రియమణి హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్యన్‌ అతను చెప్పింది చెప్పినట్టు తీస్తాడనే నమ్మకంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాం. జనవరి మొదటివారం నుండి షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తాం'' అన్నారు. మరో నిర్మాత సి.హెచ్‌.రాంబాబు మాట్లాడుతూ - ''జనవరి మొదటివారంలో ప్రారంభించే ఈ చిత్రం మార్చి ఎండింగ్‌ వరకు షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాము. ఆరు వందల సంవత్సరాల క్రితం సబ్జెక్ట్‌ కాబట్టి దానికి అనుగుణంగా తిరుపతిలో ఓ భారీ సెట్‌ వేస్తున్నాం'' అన్నారు.

ఇతర ముఖ్య పాత్రల్లో కోట శ్రీనివాసరావు, సుమన్‌శెట్టి, మంజుభార్గవి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: శామ్‌ ప్రసన్‌ (వినాయకుడు ఫేం), మాటలు: గోపి, సుదర్శన్‌ బి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: వెంకటేష్‌,

వెబ్దునియా పై చదవండి