అల్లుఅరవింద్‌పై కె.ఎస్. రామారావు ధ్వజం

బుధవారం, 4 ఫిబ్రవరి 2009 (16:35 IST)
WD
నిర్మాతలు తమకు ఏవైనా సమస్యలుంటే ముందుగా ఫిలింఛాంబర్‌కు చెప్పొచ్చుగా..? దానికి చెప్పాల్సిన ఇంకితజ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్లు పత్రికలకు ఎక్కడం మంచి పద్ధతికాదని ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు అన్నారు.

"గజినీ" ప్రమోషన్ విషయంలో ఛాంబర్ ఏదో తప్పు చేసిందని, అందుకే ఇంకా కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం రాలేదని నిర్మాత అల్లు అరవింద్ అనడం సరైందని కాదని రామారావు తెలిపారు. మొదటి నుంచి అనుకున్న నియమనిబంధనల ప్రకారం 50వేలకు మించి సినిమా విడుదల పట్ల ఎటువంటి ప్రకటనలు పత్రికల్లో ఇవ్వకూడదు. ఈ విషయం అల్లు అరవింద్‌కు బాగానే తెలుసునని రామారావు గుర్తు చేశారు.

చిరంజీవి, అర్జున్‌తో సినిమాలు తీసినప్పుడల్లా లేని నిబంధనలు.. ఒక్కసారిగా బాలీవుడ్ "గజినీ" తీసే సరికి మార్చేస్తారా? అంటూ రామారావు ప్రశ్నించారు. రాజకీయనాయకుడిలా ఏదేదో మాట్లాడటం మంచిపద్ధతి కాదని ఆయన సూచించారు.

అదేవిధంగా ఇటీవలే కొంతమంది చిన్న నిర్మాతలు.. పర్సెంటేజీ విధానం, టాక్స్ విధానం హామీ నెరవేర్చలేదంటే.. తామే నిర్ణయాలు తీసుకుంటామని ప్రెస్‌మీట్ పెట్టారు. అదికూడా తప్పేనని రామారావు పేర్కొన్నారు. గతనెల 27న ఛాంబర్ అత్యవసర సమావేశంలో ఈ విషయంలో తగిన నిర్ణయాన్ని తీసుకున్నామని, దానికి వారుకూడా హాజరయ్యారని రామారావు తెలిపారు. ఇదంతా ఇండస్ట్రీలో అనైక్యతకు దారితీస్తుందని రామారావు వాపోయారు.

వెబ్దునియా పై చదవండి