"ఏక్ నిరంజన్" పైరసీ సీడీల పట్టివేత

WD
ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ నిర్మించిన "ఏక్ నిరంజన్" అక్టోబరు 29న 350కి పైగా ప్రింట్లతో 700కి పైగా థియేటర్లలో విడుదలైంది. ఐతే ఈ చిత్రాన్ని కొందరు వీడియో పైరసీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చంది.

దీంతో ఆదిత్యారామ్ కార్యాలయంలో వీడియో పైరసీని అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం రాష్ట్రమంతా రైడ్ చేసి వరంగల్, కడప, హైదరాబాద్, అవనిగడ్డలలో "ఏక్ నిరంజన్" పైరసీ సీడీలను పట్టుకొని పైరసీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేయించారు. ప్రింట్లపై ఉన్న స్పెషల్ కోడ్స్ ద్వారా పైరసీ ఏ ప్రింటు నుండి జరిగిందో తేలిగా కనుక్కోవచ్చు కనుక పైరసీదారులను వెంటనే పట్టుకుని శిక్షించడానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యరామ్ మాట్లాడుతూ... "ఏక్ నిరంజన్" సూపర్ హిట్ అవడం, రికార్డ్ కలెక్షన్స్ సాధించడం చాలా ఆనందంగా ఉన్నప్పటికీ వీడియో పైరసీ వలన ఎంతో నష్టం జరుగుతోందని అన్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రేక్షకులకు వినోదం అందించాలని నిర్మించిన ఏక్ నిరంజన్ చిత్రాన్ని పైరసీ సీడీల్లో చూడవద్దని, బిగ్ స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులను కోరారు. ఏక్ నిరంజన్ వీడియో పైరసీని అరికట్టడానికి సరైన సమాచారాన్ని అందించి సహకరించే ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులకు విలువైన బహుమతులను కూడా అందించడం జరుగుతుందని ఆదిత్యరామ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి