ఒకే రోజు ముగ్గురు సినీ నటులు మృతి

గురువారం, 7 ఫిబ్రవరి 2008 (19:16 IST)
WD
చలన చిత్రరంగానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు చనిపోయిన దుస్సంఘటన గురువారం జరిగింది. సీనియర్ నటి కల్పనారాయ్ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందగా, పగలు మరో నటుడు లక్ష్మీపతి అకాలమరణం పొందారు. 'ప్రేమికుల రోజు' చిత్రంలో హీరోగా నటించిన కునాల్ కూడా ఈ రోజు మరణించారు. ముంబైలోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అహ్మదాబాద్‌లోని తన భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు కునాల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

నటి కల్పనారాయ్ మృతి
ప్రముఖ నటి కల్పనారాయ్ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో మరణించారు. ఆమె అసలు పేరు సత్యవతి. 1942లో జన్మించిన ఈమె స్వస్థలం కాకినాడలోని సూర్యనారాయణపురం. ఆమెకు 10 సంవత్సరాల వయస్సులోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. కాకినాడ నుంచి హైదరాబాద్ మకాం మారేవరకు ఆమెకు ఆమె అక్క తోడుగా ఉండేది. ఆమె స్వతహాగా మంచి అందగత్తె. ఓ జబ్బువల్ల ఆమెకు ఒళ్లు మారిపోయిందని కుటుంబసభ్యులు తెలియజేశారు.

గత కొంత కాలంగా ఆమె హృదయ సంబంధ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఆమెకు ఉష అనే దత్త కుమార్తె ఉంది. సత్యవతిగా 1972లో ఓ 'సీతకథ'తో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కల్పనారాయ్‌గా పేరు మార్చుకున్నారు.

దాదాపు 500 చిత్రాల్లో హాస్య పాత్రలను పోషించి తనదైన శైలి సృష్టించారు. హిట్లర్‌లో 'హిట్లర్ ఇల్లు ఎక్కడా అంటూ...' చిరంజీవినే అడిగిన తీరు నవ్వు తెప్పిస్తాయి. ఇక 'జంబలకిడి పంబ' చిత్రంలో అందరూ హాస్యనటులు పాల్గొనే సన్నివేశంలో.. ఎక్కాలు, గుణింతాలు చెప్పాల్సిన సన్నివేశంలో బాబూమోహన్ ఆమెను పద్యం వల్లించమంటే.. ఉప్పుకప్పురంబు ఒక్కపోలిక ఉండు.

పురుషలందు.. అంటూ.. పురుష్. శబ్దం. సిగ్గుపడుతూ పలికే సన్నివేశం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆమె మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగబాబు, మల్లికార్జునరావులు ప్రగాఢసానుభూతిని తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని గురువారం సాయంత్రం పంజాగుట్ట స్మశానవాటికలో దహనం చేశారు.

పలువురి సంతాపం
కల్పనారాయ్ మృతిపై పలువురు ఆర్టిస్టులు తీవ్రసంతాపాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటులు బ్రహ్మానందం, రాళ్లపల్లి, గుండు హనుమంతురావు, హేమ తదితరులు ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం: మల్లికార్జునరావు
ఆమె రంగస్థల నటి. ప్రాథమిక దశలో ఊర్వశి శారదతో మంచి సాన్నిహిత్యం ఉండేది. విభిన్న పాత్రలు పోషించేది. సినిమా పరిశ్రమలో ఆమెది ప్రత్యేక స్థానం. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేది. షూటింగ్ గ్యాప్‌లో ఆమె మిమిక్రీ చేస్తూ అందర్నీ నవ్వించేదని గుర్తు చేసుకున్నారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ గత మూడేళ్లుగా ఆమెకు పెన్షన్ ఇస్తోంది. అప్పుడప్పుడు ఆమె అభ్యర్ధన మేరకు రెండు పర్యాయాలు ఆర్ధిక సాయం కూడా చేయడం జరిగింది. తను కాకినాడకు మకాం మార్చేస్తున్నట్లుగా ఆమె ఇటీవలే చెప్పింది. మా అసోసియేషన్ తరుపున 10వేల రూపాయలను ఈ రోజు అందజేశాం. ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను.

మానవత్వం ఉన్న మనిషి: రాళ్లపల్లి
పదిమందికి అన్నం పెట్టడంలో ఆమె ఆనందపడేది. కొత్తగా ఎవరైనా అర్టిస్టులు వస్తే వారికి దగ్గరుండి అన్నం పెట్టేది. ఆమె సంపాదించింది చాలా వరకు ఇతరులకు అవసరమైనప్పుడు దానం చేసేది. రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చింది. రేలంగి, అంజలీదేవి, సూర్యకాంతం వంటి వారు సభ్యులుగా ఉన్న 'యంగ్ మాన్ హ్యాపీ క్లబ్'(కాకినాడ) నుంచి వచ్చిన నటి ఆమె. చాలా టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. లేడీ కమేడియన్‌లలో అటువంటి వారు అరుదు. ఆమె ఏ చిన్న పాత్ర వేసినా ఒక్క నిమిషం కనిపిస్తే చాలనుకునేవారు. ఆ ఒక్కనిమిషం ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. చాలా మంది సీనియర్స్‌తో కలిసి నటించింది. చివరి వరకు ఆర్టిస్టుగానే తపించింది. ఆమె పోషించిన పాత్రల్లో సర్వెంట్ పాత్ర హైలెట్‌గా ఉండేవి. ఆఖరి దశలో తోటి వారి సాయం కోసం పరితపించే ఆమె దుస్థితి మరెవరికీ రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

హస్యనటీమణిని కోల్పోయాం: గుండు హనుమంతురావు

తెలుగు సినిమాకు సంబంధించి మరొక హాస్యనటీమణి వెళ్లిపోయింది. సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ అందరి తర్వాత అంతటి పట్టు ఉన్న నటి. ఇచ్చిన పాత్రల్లో క్వాలిటీ చూపించిన హాస్యనటి.

ప్రతి పాత్రలోనూ జీవించేది: ఎస్‌వీ రావు
తనకు ఎటువంటి పాత్రనిచ్చినా దానిని అవలీలగా చేసేది. 'శుక్రవారం మహాలక్ష్మి' చిత్రంలో సాక్షిరంగారావు కాంబినేషన్‌లో ప్రత్యేక పాత్ర వేసింది. ఆమె నటన అద్భుతం. కొన్ని ఆరోగ్యకారణాల వల్ల ఆమె ఒళ్లు చేయడం జరిగింది. అయినా అటువంటి తరహాలో పాత్రలు వేసి తన హాస్యంతో మెప్పించేది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ పాత్రల్లో అద్భుతంగా నవ్వించేది.

లక్ష్మీపతి అకాల మరణం
నటుడు లక్ష్మీపతి గురువారం అకాలమరణం పొందారు. జయం, అమ్మాయిలుఅబ్బాయిలు, మురారి వంటి 40 చిత్రాల్లో నటించారు. రంగస్థల, టీవీ నటుడు. ఎవడిగోలవాడిది, సుందరానికి తొందరెక్కువ, అత్తిలి సత్తిబాబు, మంగతాయారు టిఫిన్ సెంటర్ వంటి చిత్రాల్లో నటించారు. మంచి టైమింగ్ ఉన్న నటుడిని కోల్పోవడం దురదృష్టకరమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి