చిరంజీవి తర్వాత టాలీవుడ్ నెంబర్‌ 1 ఎవరు...?

శుక్రవారం, 15 ఫిబ్రవరి 2013 (18:27 IST)
WD

టాలీవుడ్‌లో చిరంజీవి తర్వాత నెంబర్ 1 రేసుపై చర్చ జరుగుతోంది. 2013 సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండోనెల జరుగుతోంది. నూతన సంవత్సరంలో చాలా మందికి కొన్ని లక్ష్యాలుంటాయి. గోల్స్‌ ఉంటాయి. సినిమా రంగంలో కూడా ఇంతే. నెంబర్‌వన్‌ స్థానంపై మాట్లాడుకుంటూ ఉంటారు. నేనే నెంబర్‌వన్‌ అని అనుకోవడం గొప్ప తృప్తిగా, గర్వంగా సంతోషంగా ఉంటుంది. ఆ విషయాన్ని వారు చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఎక్కడో దానిమీద కన్ను ఉంటుంది.

చిరంజీవి తర్వాత నెంబర్‌ ఒన్‌ ఎవరు?
ఎన్‌.టి.ఆర్‌. ఎఎన్‌.ఆర్‌. కృష్ణ, బాలకృష్ణ, శోభన్‌బాబు తర్వాత ఒక్కసారిగా ఊపులోకి వచ్చిన నటుడు చిరంజీవి. అంతకుముందు నేనే నెంబర్‌ 1 అంటూ కృష్ణ సినిమా తీశారు కూడా. అప్పట్లో ఓ సినిమా పత్రిక ఏర్పాటు చేసిన సర్వేలో కృష్ణ నెంబర్‌1గా నిలిచి సూపర్‌స్టార్‌ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి మెగాస్టార్‌గా నిలిచారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఒక ట్రెండ్‌ సృష్టించి నిలిచాడు. ఏనాడు తెలుగు చలనచిత్రరంగంలో బాలయ్య నెంబర్‌ ఒన్ అనిపించుకోలేదు. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి చిత్రాలు తీసినా సక్సెస్‌లు సాధించాడే కానీ.. నెంబర్‌ ఒన్‌ పై ఆసక్తి చూపలేదు.

పవన్‌ కళ్యాణ్‌ 1వ స్థానం కోసం చూస్తున్నాడా?
చిరంజీవి కేంద్రమంత్రి కావడంతో సినిమాలు ఆగిపోయాయి. దాదాపు ఆరేళ్ళు దాటింది. అయినా... ఆ స్థానం ఎవరిదనే ప్రశ్నే ఉత్పన్నం తప్ప.. మహేష్ బాబు, జూ. ఎన్‌.టి.ఆర్‌. పవన్‌ కళ్యాణ్‌లు దానిని ఆక్రమించారని ఎవ్వరూ అనలేక 'మగధీర', గబ్బర్‌సింగ్‌, బిజినెస్‌మేన్‌, దూకుడు, కెమెరామెన్‌ గంగతో రాంబాబు వంటి సినిమాలు రికార్డులు ఒకదానికొకటి బద్దలు కొట్టాయంటూ స్టేట్స్‌మెంట్సు ఇస్తూ.. డైరెక్ట్‌గా నెంబర్‌ 1 మేమే అనలేని పరిస్థితి.

WD
లెక్కల్లో తేడా!
లోగడ అయితే.... చిరంజీవి.. విషయంలో ఫ్యాన్స్‌ హడావుడి చేసేవారు. ఒక హీరోకి హిట్‌ వస్తే.. మరో హీరో హిట్‌పై కామెంట్లు చేస్తూ ఫ్యాన్స్‌లు పందాలు, హడావుడిలు చేసేవారు. రానురాను ఆ పరిస్థితి మారినా.... కొద్దోగొప్పో ఆ వాసనలు ఇంకా వీడలేదు. కలెక్షన్ల రికార్డులు అంటూ లెక్కలు వేస్తున్నారు. అయితే అందులో ఒక్కో జిల్లాలోనూ, ఒక్క రోజులో ఇన్ని లక్షలు వచ్చాయంటూ సరిపెట్టుకోవడం జరుగుతోంది. దీనికితోడు థియేటర్ల హడావుడి ఎక్కువైంది.

ఏ ఒక్క హీరో కూడా వందలాది థియేటర్లకు మించి సినిమాలు విడుదల చేయడంలేదు. సంక్రాంతికి వచ్చిన రామ్‌ చరణ్‌ చిత్రం నాయక్ 1200 థియేటర్లలో ఈ ఏడాది జనవరికి విడుదలయ్యాయి. అదే వెంకటేష్‌, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రానికి వందల సంఖ్యలో థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గతంలోని చిత్రాలను బేరీజు వేస్తూ... లెక్కలు వేయడం పరిపాటి అయింది. కానీ ఇందులో చాలా తేడాలున్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వంటివారే వ్యాఖ్యానించడం విశేషం.

WD

చిరంజీవి స్థానం పవన్‌దే!
దేదో స్వంత కంపెనీలో ఛైర్మన్‌ పదవి లాగా.. చిరంజీవి తర్వాత స్థానం బాబాయ్‌దేనంటూ... రామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించడం సినీ విశ్లేషకులకు విస్మయాన్ని కల్గించింది. బహుశా అది మెగా అభిమానుల్ని ఉద్దేశించి చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కొడుకుగా తనలో కాకుండా బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌లో చూసుకోండని రామ్‌ చరణ్‌ భావం కావచ్చు.

తండ్రి స్థానాన్ని ఆక్రమించడానికి నాకింకా సమయం పడుతుందని ఆయనకు అర్థమయింది. దాంతో అభిమానులు కూడా పవన్‌ కళ్యాణ్‌ జిందాబాద్‌ అన్నారే కానీ.. చిరంజీవి, రామ్‌ చరణ్‌ పేరును మాత్రం ప్రస్తావించక పోవడం విశేషం. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ చిత్రాల ఆడియో వేడుకల్లో... అభిమానులు మాత్రం పవన్‌ గురించి కేకలు వేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

WD

జూ.ఎన్‌.టి.ఆర్‌. కాగలడా?
నెంబర్‌ 1 కాగల లక్షణాలు, అవకాశాలు ఎన్‌.టి.ఆర్‌.లో పుష్కలంగా ఉన్నా... వయస్సుకు మించిన పరిణితి ప్రదర్శిస్తూ.. ముదురుగా నటించడం అతనికి పెద్ద మైనస్‌గా పరిణమిస్తోంది. ఎన్‌.టి.ఆర్‌. నటుడే కానీ.. ఎందువల్లో సహజత్వం లోపిస్తుంది అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొందరు దర్శకులు సినిమాలు చెడగొడుతున్నారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. రాజమౌళి ఒక్కడే ఎన్‌.టి.ఆర్‌.ను ఓవర్‌ చేయకుండా సహజంగా నటనను రాబట్టగలిగాడని చెబుతున్నారు.

ప్రభాస్‌ పరిస్థితి ఏమిటి?
ఇక ప్రభాస్‌ విషయంలో ఆ ఆలోచన అవసరంలేదని అంటున్నారు. అడపాదడపా హిట్లు ఇస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సృష్టించే సత్తాపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలినవారు ఎవరైనా తమ మార్కెట్‌ను కాపాడుకోగలిగితే అదే పదివేలంటున్నారు.

WD
మహేష్‌ బాబు ఏమంటున్నాడు!
ప్రేక్షకుల సంతృప్తి, నిర్మాత బయ్యర్ల సంతోషం పరిగణలోకి తీసుకుంటే నేడు తెలుగు సినిమా నెంబర్‌ వన్‌ స్థానం మహేష్‌బాబుకి చెప్పొచ్చని సర్వేలో తేలిందట. అదెలాగంటే.. గతంలో ఏడాది పైగా మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు. కానీ ఓ వస్తువును మార్కెట్‌ చేయడానికి పలు కంపెనీలు రంగంలోకి దిగి దక్షిణాదిలో సర్వే చేస్తే... ఎక్కువశాతం మహేష్‌ బాబుకే ఓట్లు పడ్డాయి. దాంతో తాను సినిమాలు చేయకపోయినా ఇంత ఫాలోయింగ్‌ ఉందా? అంటూ ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. దాంతో యాడ్స్‌ చేయడం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత చేసిన సినిమాలు ఒక్కోటి హిట్‌ అవుతూనే ఉన్నాయి. కానీ నెంబర్‌ 1 విషయంలో మహేష్‌ బాబు మాత్రం... నేననుకోవడం లేదు. మీరనుకుంటే చెప్పండని తెలివిగా సమాధానమిచ్చాడు. ఎందుకంటే ప్రస్తుతం ఎవరు నెంబర్‌ 1 అనేది చెప్పడం కష్టం. సినిమా రంగంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక హీరో హిట్‌ ఇస్తే.. రెండో సినిమా ఫ్లాప్‌ కావచ్చు. అలా జరిగిన ఉదంతాలు ఉండనే ఉన్నాయి.

అందుకే ఇప్పుడు మల్టీస్టారర్‌ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో నెంబరన 1 స్థానం గురించి మాట్లాడటం అంత సమంజసం కాదని మహేష్‌ బాబు కూడా అన్యోపదేశంగా చెప్పనే చెప్పాడు. దీంతో నెంబర్ ‌1 స్థానం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి