'జంజీర్' కురచ నిక్కరుతో ప్రియాంకా... ముంబై పోలీసులు ఫైర్!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (08:11 IST)
FILE
ప్రస్తుతం మనోభావాల కాలం నడుస్తోంది. కులాన్ని కాని, మతాన్ని కాని, ప్రాంతాన్ని కాని, భాషను కాని, వృత్తుల్ని కానీ ఏ మాత్రం కామెడీకి వాడుకున్నా... వెంటనే మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉద్యమాలు లేస్తున్నాయి. అందుకే సినిమాలను జాగ్రత్తగా తీస్తున్నారు దర్శక, నిర్మాతలు.

తాజాగా ఇప్పుడు ముంబై పోలీసులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫైర్ అనుతున్నారు. దానికి కారణం బాలీవుడ్ స్టార్ ప్రియాంకచోప్రా. 'జంజీర్' చిత్రంలోని ఓ పాటలో ఆమె బిగువైన కురచ నిక్కర్ ధరించి నర్తించారు. అదే పోలీసుల నిరసనకు కారణమయ్యింది. అలాంటి నిక్కర్లు తను చాలాసార్లు ధరించారు కదా అనుకుంటున్నారా? విషయం ఏంటంటే... పోలీస్ యూనిఫామ్ వేసుకొని కింద మాత్రం కురచ ఖాకీ నిక్కర్ ధరించారు ప్రియాంక. చూడ్డానికి ఆ వేషధారణ మరీ ఇబ్బందిగా ఉండటంతో పోలీసులు సదరు దర్శక, నిర్మాతల వద్ద అభ్యంతరం వెలిబుచ్చారట.

ముఖ్యంగా మహిళా పోలీసులైతే... ఈ డ్రస్ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారని వినికిడి. పోలీస్ గొప్పతనాన్ని తెలిపే నేపథ్యంలో వచ్చే పాట ఇదని, సాహిత్యం కూడా పోలీసులను కొనియాడుతూ ఉంటుందని దర్శకుడు అపూర్వ లాఖియా ఎంత చెప్పినా ముంబయ్ పోలీసులు ససేమిరా అంటున్నారని బాలీవుడ్ సమాచారం. మరి ఆ పాటను సినిమాలో ఉంచుతారో, లేక కత్తిరిస్తారో వేచిచూడాలి.

వెబ్దునియా పై చదవండి