జీవితాంతం నటుడిగానే కొనసాగుతా: ఏవీఎస్

బుధవారం, 10 సెప్టెంబరు 2008 (17:38 IST)
WD
ఏకాలంలోనైనా.. పూసే పువ్వులు వికసించకపోతే దాన్ని ఆస్వాదించేవారు చాలా బాధకు గురవుతారు. అది మళ్ళీ వికసిస్తే దాని ఆనందం వర్ణించలేనిది. హాస్యనటునిగా తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్న నటుడు ఏవీఎస్ విషయంలో కూడా అదే జరిగింది. దాదాపు 410 చిత్రాల్లో నటించిన దర్శకుడిగా, నిర్మాతగా మారిన ఆయన తన నిజజీవితంలో ఊహించని ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు.

అందుకే ఈ ఏడాదిని మర్చిపోలేనని అంటున్నారు. ఆరోగ్యరీత్యా లివర్ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆయన కుమార్తె లివర్‌తో బతికి బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు. "మృత్యుముఖం దాకా వెళ్ళి అక్కడ గేటుమూసేస్తే తిరిగి వెనక్కి వచ్చానంటూ.." తనదైన శైలిలో చమత్కరించారు.

తనకు పునర్జన్మ ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ... అటు ఇండస్ట్రీ నుంచి, ఇటు ప్రేక్షకులతో పాటు ప్రతిఒక్కరూ తను కోలుకోవాలని ఆకాంక్షించినందుకు పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా మంది ఫోన్ల ద్వారానూ, వ్యక్తిగతంగా వచ్చి కలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

తాను నవ్వుతూ ఉండాలనే వారి ఆకాంక్ష నెరవేరిందని, ఆ నవ్వే తనను బతికించిందని ఏవీఎస్ అన్నారు. మళ్ళీ నవ్వులు పూయించడానికి తాను సిద్ధమని తెలిపారు.

సెప్టెంబర్ 7వ తేదీకి ఏవీఎస్ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మళ్ళీ తాను సినిమాల్లో నటిస్తున్నానంటే... ఇండస్ట్రీ, ప్రేక్షకుల ఆదరణే కారణమని బుధవారం తెలియజేశారు. ఆనాడు తొలిషాట్ స్వర్గీయ ఎన్.టి.ఆర్‌తో కలిసి "శ్రీనాథ కవి సార్వభౌమ" చిత్రానికి పనిచేశానని గుర్తు చేసుకుంటూ... అప్పటి నుంచి.. ఇప్పటి వరకు వివిధ రూపాలను తాను ప్రదర్శించానని, తన జీవితాంతం నటుడిగానే కొనసాగుతానని పునరుద్ఘాటించారు.

ఈ నెల 20నుంచి మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాయని తెలుపుతూ.. ఎస్. వి. కృష్ణారెడ్డి, సి.సి.రెడ్డి, శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలోనూ, ఎన్. శంకర్ చిత్రంలోనూ, కె. విశ్వనాథ్ దర్శకత్వంతో పాటు ఆరు సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. బాబ్జీ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న "నేను గాంధీని కాను" అనే చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఈ నెల 14న జరుగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనబోవడం లేదని, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాత్రమే ఉంటానని వెల్లడించారు. ఇండస్ట్రీకి రాజకీయాలు అనవసరమని అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించుకోవాలని, దాని కోసం అందరూ శ్రమించాలన్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార స్పోక్స్‌మెన్‌గా ఉన్నానని, దానిలోనే కొనసాగుతానని చెప్పారు. చిరంజీవిగారు మంచి నటుడని, వ్యక్తిగతంగా తనకెంతో ఇష్టమని, ఆపరేషన్ సమయంలో తనతో రెండుగంటలు గడిపారని అన్నారు. చిరు ప్రజాదరణ ఉన్న నటుడని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి