ధనుష్, శ్రియ జంటగా "శీనుగాడు మహాముదురు"

టాలీవుడ్‌ ద్వారా పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ శ్రియ, ఈ మధ్య ఇతర భాషా చిత్రాల ద్వారా బిజీ అవుతోంది. అయితే టాలీవుడ్‌ను వదిలి పెట్టకుండా స్పెషల్ సాంగ్, అడపాదడపా పాత్రలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. తమిళంలో "మళై" (తెలుగులో వర్షం రీమేక్) చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన శ్రియ, ఆ తర్వాత "శివాజీ"లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

ఓ వైపు రజనీతో నటిస్తూనే రజనీ కాంత్ అల్లుడు "ధనుష్"తో శ్రియ "తిరువిలైయాడల్ ఆరంభం" సినిమాలోనూ జత కట్టేసింది. తాజాగా ఈ అనువాద చిత్రాన్ని "శీనుగాడు మహాముదురు" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ సౌదామిని క్రియేషన్ బ్యానర్‌పై, కె.వి.వి. సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.

తమిళంలో ధనుష్‌కు మంచి మాస్ అప్పీల్ ఉంది. శ్రియకు గ్లామర్ క్వీన్ అనే పేరుంది. ఈ ఇద్దరు కలిసి నటించిన ఈ తమిళ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని నిర్మాత తెలిపారు. ప్రేమ, వినోదం, యాక్షన్ వంటి అంశాలన్ని ఇందులో ఉన్నాయన్నారు. ఈ చిత్రానికి జి. భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి