నా "రియల్" రేటు ఇప్పుడెంత...?

WD
ఒక్క సినిమా సక్సెసయితో చాలు. ఆ తర్వాత లక్షలే లక్షలు. ఆపైన కోటాను కోట్లు. ఆ డబ్బును మరోచోట పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించాలనే ఆలోచన. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి... ఎంచక్కా కోట్ల రూపాయలను గడించినవారెందరో ఉన్నారు.

రియల్ వ్యాపారంలో పాతతరం నటీనటులతోపాటు కొత్త తరం హీరోహీరోయిన్లు కూడా ఉన్నారు. సీనియర్ నటీనటులు ఎకరాలకు ఎకరాల భూములను కొనుగోలు చేసి... ప్రస్తుతం వాటిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇక కొత్త తరం హీరోహీరోయిన్లు తమకు వస్తున్న అత్యధిక పారితోషికాలను ఏం చేయాలో తెలియక... సదరు సీనియర్ నటులు ఇచ్చిన సలహా మేరకు రియల్ వ్యాపారంలో డబ్బును ధారపోస్తున్నారని భోగట్టా.

మొన్నటివరకూ రియల్ అవతారం బాగానే వెలిగిపోయింది. కానీ ఇటీవల ప్రపంచంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఐటీ పరిశ్రమ కుదేలు, సెన్సెక్స్ కుప్పిగంతులు... వెరసి రియల్ "భూం"... 'ఢాం' అంది. దీంతో ఒకప్పుడు చుక్కలను చూసిన భూముల ధరలు పాతాళం ఎక్కడుందా అన్నట్లు వెతుకుతున్నాయి.

లక్షలు పోసి కొనుగోలు చేసిన భూముల ధరలు ఒక్కసారిగా పడిపోవడాన్ని చూసి, ఆ వ్యాపారంలో చేయి పెట్టి ఇరుక్కున్నవారు... ముఖ్యంగా వర్థమాన సినీ తారలు ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటున్నారు.

కాజల్ అగర్వాల్ వంటి నూతన తారలు, సీనియర్ నటులు( రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు) కనబడితే చాలు భూముల ధరలపై చర్చలకు దిగుతోందట. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని సుదీర్ఘ చర్చలకు దిగుతోందని భోగట్టా. ఇలా కొత్తతరం తారలలో చాలామంది సీనియర్ నటీనటులను "రియల్"గా వాయించేస్తున్నారట. ఈ గోడు పడలేక చాలా మంది ముఖం చాటేస్తున్నారట. ఏదేమైనా ఇది 'రియల్'గా బాధించే అంశం కదూ...

వెబ్దునియా పై చదవండి