పాత్రలకు జీవం పోసిన 'గుమ్మడి' అంత్యక్రియలు రేపు

File
FILE
సినిమాల్లో తనకు లభించిన పాత్రలకు జీవంపోసి ప్రత్యేకత చాటిన గుమ్మడి వెంకటేశ్వరావు (గుమ్మడి) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ గుణచిత్ర నటుడిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి మంగళవారం కన్నుమూశారు. మూత్రపిండ సంబంధింత సమస్యలతో గత ఆదివారం కేర్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఆయనకు వైద్యులు ఎంతో మెరుగైన వైద్య సేవలు చేసినప్పటికీ.. ప్రాణాలు కపాడలేక పోయారు.

ఫలితంగా మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కేర్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన అంత్యక్రియలు గురువారం జరుపనున్నట్టు వైద్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా రావికంపాడులో 1927లో జన్మించిన గుమ్మడి దాదాపు 500లకుపైగా చిత్రాలలో నటించారు.

ఏకధాటిగా ఆరు దశాబ్దాల పాటు చిత్ర రంగంలో హీరోగా, విలన్‌గా, కారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా.. తనకు లభించిన పాత్రలను పోషించి, వాటికి జీవం పోశారు. తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన సేవలు ఎనలేనివి. 1950లో "అదృష్టదీవుడు" అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గుమ్మడి, ఆ తర్వాత ఎలాంటి భేషజాలకు పోకుండా అన్ని రకాల పాత్రలను పోషించేందుకు ముందుకు వచ్చారు.

అలా రావడమే ఆయన 60 సంవత్సరాల పాటు చలన చిత్ర పరిశ్రమలో కొనసాలేగా చేసింది. ప్రధానంగా, "దశరథుడి" పాత్రలో ఆయన అచ్చుగుద్దినట్టు సరిపోయేవారు. ఇదిలావుండగా, 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రానికి గాను రాష్ట్రపతి రజతపతకం అందుకున్న గుమ్మడి, మరోమలుపు చిత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమనటుడిగా, 1999లో రఘుపతి వెంకయ్య అవార్డును పొందడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా పొందారు. గుమ్మడికి ఇద్దరు కుమారులు, అయిదుగురు కూతుళ్లు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి