పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారు: నటుల సంతాపం

ఊహించనిది : దాసరి
ఈరోజు ఉదయం కూడా సెక్రటేరియట్‌కు వెళ్లాను. అడవుల్లో చిక్కుకుని ఇంకా బయటకు వస్తారని భావించాను. కానీ ఆయన లేరనే వార్త ఊహించలేకపోయాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్కతాటిపై తెచ్చిన ఘనత ఆయనదే. కాంగ్రెస్ అంటేనే అసమ్మతికి పేరు. అలాంటిది అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టిన కృషీవలుడు వై.ఎస్.

రాజీవ్‌గాంధీ కంటే బాధించింది : కృష్ణ
రాజీవ్‌గాంధీ చనిపోయినప్పుడు ఇక రాజకీయాల్లోకి రాకూడదనుకున్నాను. కాస్త దూరంగా ఉన్నాను. అప్పుడు చాలా బాధపడ్డాను. మళ్లీ అంతకంటే వై.ఎస్. దుర్మరణం వార్త కలచివేసింది. 85లో నేను ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు నా వెన్నంటి ఉండి ప్రచారం చేశారు. ఎప్పటికీ మర్చిపోలేని నాయకుడు వై.ఎస్.

గుండె నిబ్బరంగల మనిషి : నూతన్ ప్రసాద్
వై.ఎస్. గుండె నిబ్బరంగల వ్యక్తి. ఎటువంటి కార్యాన్నైనా సాధించగల వ్యక్తి. ఆయన తర్వాత ఎవరు వచ్చినా ఆయన ప్రారంభించిన జలయజ్ఞం కొనసాగించాల్సిందే. ఇంకా కొత్తవి చేయడానికి ఏమీలేవు. "ఆరోగ్యశ్రీ" పథకం భారత్‌లో ప్రవేశపెట్టిన వ్యక్తి. డాక్టర్‌గా ఆయన తీసుకున్న నిర్ణయం అది.

రాజా.. అని పిలిచేవారు : కృష్ణంరాజు
నన్నెప్పుడూ "రాజా".. అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనకు నాకు 25 ఏళ్ల పరిచయం. రాత్రినుంచి టీవీలు చూస్తూ, ఢిల్లీకి ఫోన్లు చేస్తూ మంచి వార్త వింటాననుకున్నా. ప్రజల మనిషి ప్రజల కోసమే త్యాగం చేశారు.

పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారు : మురళీమోహన్
అనతికాలంలోనే పేదల గుండెల్లో పేరు సంపాదించుకున్న వై.ఎస్. ఇక లేరనే వార్త నమ్మలేక పోతున్నా. ఇంకా క్షేమంగానే ఉన్నారని తెల్లవారుదాకా అనుకున్నా. కేంద్ర ప్రభుత్వం ప్రకటించాక దిగ్ర్భాంతికి గురయ్యాను. ప్రజల మనిషికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుభూతిని తెలియజేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి