"బిగ్ బి"తో లంచ్..! మరి మీ దగ్గర రూ. పది లక్షలున్నాయా..?!

File
FILE
బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో లంచ్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీ దగ్గర కనీసం పది లక్షల రూపాయలైనా ఉండాలి. ఎందుకు.. బిల్లు కట్టడానికి అనుకుంటున్నారా..? అదేం కాదులెండి. ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఈబే, ఛారిటి సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన "జారు ఆఫ్‌ గివింగ్‌ వీక్‌" వేడుకల్లో భాగంగా ఓ వేలం పాటను నిర్వహించాయి.

ఈ వేలం ద్వారా వచ్చే సొమ్మును ఛారిటి సంస్థలకు విరాళంగా ఇస్తారు. ఇందులో భాగంగా అమితాబ్‌తో లంచ్, అక్షయ్‌తో బ్రేక్ ఫాస్ట్, సల్మాన్‌తో జిమ్‌లకు వేలం పాట నిర్వహించారు. కాగా.. ఈ వేలంలో అత్యధికంగా బిబ్‌ బితో లంచ్ రూ. 10,02,000లు వెల పలికి ఇప్పటికీ అమితాబ్‌ బాలీవుడ్ "కింగ్"గా నిలిచారు.

ఇకపోతే.. అక్షయ్ కుమార్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ రూ. 5,92,000 ధర పలకగా, సల్మాన్‌ ఖాన్‌తో జిమ్‌సెషన్‌ రూ. 3,52,000 వెల పలికింది. బచ్చన్‌కు సంబంధించిన వేలంపాట బ్లాగును ప్రపంచవ్యాప్తంగా 16,770 మంది వీక్షించగా, 55 మంది వేలంలో పాల్గొన్నారు. బిగ్ బితో లంచ్‌, సల్మాన్‌తో జిమ్‌ సెషన్‌లను వర్ల్‌పూల్‌ కార్పోరేట్‌ సంస్థ వేలంపాటలో గెలుచుకోగా, అక్షయ్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అవకాశాన్ని అమెరికాకు చెందిన ఒక అభిమాని దక్కించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి