రెహమాన్‌కు స్వర్ణ కిరీట ధారణ

WD
సంగీతమాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్‌కు స్వర్ణ కిరీట ధారణ జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మారియేట్ హోటల్‌లో సుప్రసిద్ధ గాయని పి. సుశీల రెహమాన్‌ను సత్కరించారు. ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన రెహమాన్‌ను సన్మానించే అవకాశం తమకు దక్కడం పట్ల గానకోకిల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పి. సుశీల రెహమాన్‌కు స్వర్ణకిరీట ధారణ చేశారు. అదేసమయంలో రెహమాన్ తల్లికి స్వర్ణ కంకణాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ.. ప్లస్ ఒన్ చదువుకునే రోజుల్లోనే రమేష్ నాయుడు స్కూల్లో రెండు సంవత్సరాలు పనిచేశానన్నారు.

అనంతరం ఇళయరాజా, రాజ్‌కోటి వద్ద ఆరేళ్లు పనిచేశానని రెహమాన్ చెప్పుకొచ్చారు. తనకు నచ్చిన గాయని సుశీల అని, ఈ సన్మాన కార్యక్రమం ఆమె చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు. తాను సంగీతంలో ఓనమాలు దిద్దుకుంది తెలుగులోనేనని రెహమాన్ గుర్తు చేసుకున్నారు.

ఇదే వేడుకలో రఘురాజ్, గురవారెడ్డి వంటివారు ఆలోచించి రెహమాన్‌‍కు "స్వరాల సామ్రాట్" (సుర్ షెహెనషా) బిరుదును ప్రదానం చేస్తున్నట్లు సి.నారాయణ రెడ్డి ప్రకటించారు.

పి. సుశీల మాట్లాడుతూ.. వందేమాతరం అనే దేశభక్తి గేయానికి గొప్ప అర్థానిచ్చిన రెహమాన్ అప్పట్లో ఒక శకమైతే, "జయహో" అంటూ మరో శకానికి శ్రోతలను తీసుకెళ్ళారని ప్రశంసల వర్షం కురిపించారు. రెహమాన్ తల్లి కరీమాబేగం జ్యోతిప్రజ్వలనతో సభ ప్రారంభమైంది.

వెబ్దునియా పై చదవండి