"రోబో" వ్యవహారంలో నన్ను చెడ్డవాణ్ణి చేయొద్దు: చదలవాడ

WD
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్‌లు జంటగా శంకర్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు రూపొందించిన రోబో చిత్రం తెలుగు వెర్షన్ వివాదస్పదమవుతోంది. ఈ సినిమాను తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్‌కు చెందిన చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేసినట్లు పలు ఛానల్స్‌లో ప్రింట్ మీడియాలోనూ వచ్చింది. అయితే సన్ ఫిలిమ్స్‌వారు రోబో సినిమా తెలుగు హక్కులను ఎవ్వరికీ ఇవ్వలేదు అని ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అది ప్రసారం చేసిన ఛానల్స్‌కు నోటీసులు పంపారు.

ఈ విషయాన్ని వివరించడానికి చదలవాడ శ్రీనివాసరావు వారి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోబో సినిమా ప్రారంభం నుండి ఆ సినిమా అంటే క్రేజ్ ఏర్పడింది. నేను కూడా దానికి సంబంధించిన న్యూస్ చదివి ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే మంచి కథ, సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రతిభ గల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కాబట్టి సినిమా మీద ఇష్టం ఏర్పడింది.

ఇలా ఉంటున్న సమయంలో మాకు స్నేహితుడు అయిన నిర్మాత మహేంద్ర కుమారుడు జీతు వచ్చి రోబో సినిమా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెబితే సరే చేద్దామని అన్నాను. వారి ద్వారా సన్ పిక్చర్స్‌కు చెందిన ఉదయ్ కుమార్ మా వద్దకు వచ్చారు. తెలుగు సినిమా ఆడియో విడుదలైన తర్వాత వ్యాపార విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. ఈ సినిమా ఆడియో మలేషియాలో జరుగుతుంటే మమ్మల్ని ఆహ్వానించారు. నాకు పని ఉండటంతో నేను వెళ్లకుండా మా సంస్థ ప్రతినిధులను ఐదుగురిని పంపాను. వాళ్లే రానుపోను టిక్కెట్లు ఇచ్చారు. అక్కడ ఆతిధ్యం ఇచ్చారు.

అక్కడి నుండి వచ్చిన తరువాత వారి ప్రతినిధులతో మాట్లాడ్డం జరిగింది. వాళ్లు ఓ రేటు చెప్పారు. నేను మరో రేటు అడిగాను. అలాకాదు 27 కోట్లకు అమ్మమని నిర్మాత చెప్పారు... అంటే సరే అని సినిమా మీద ఉన్న క్రేజ్‌తో మారుమాట్లాడకుండా ఒప్పుకున్నాను. అప్పుడు ఓ పదివేలు టోకెన్ అడ్వాన్స్‌గా ఇచ్చాను. తరువాత పేపర్ మీద కండిషన్స్ వారి లెటర్ హెడ్‌పై రాసిచ్చారు.

అడ్వాన్స్‌ రేపటిలోగా ఇవ్వాలని చెబితే సన్ పిక్చర్స్ పేరుమీద రెండు కోట్లు డి.డి తీసి వారికి ఇవ్వడమే కాకుండా దాన్ని సన్ పిక్చర్స్ కార్యాలయానికి మెయిల్ చేశాం. ఇది జరిగిన వెంటనే ఆంధ్రజ్యోతి పత్రికవారు ఈ వ్యాపార విషయం తెలిసి నన్ను అడిగితే అవును ఆ సినిమా తీసుకున్నామని చెప్పాను. అది ఆ పత్రికలోనూ టీవీ వార్తల్లోనూ వచ్చింది. అలా వార్త రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదించడం ప్రారంభించారు. అది తెలుసుకుని వారు ఏమనుకున్నారో ఏమో మేము అందరివద్దా ఈ సినిమా పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నామని నింద వేస్తూ అసలు మేము వారికి అమ్మలేదని ప్రకటించారు.

వారి వద్ద నుండి సినిమా కొనడానికి మేము రెండుకోట్లు డి.డి తీసి పంపించాము. డి.డి అందింది అని రిసీవ్డ్ లెటర్ కూడా అందుకున్నాం. వారి లెటర్ ప్యాడ్‌లో ఉదయ్ కుమార్ సంతకం చేసిన ప్రాథమిక ఒప్పందం లెటర్ కూడా ఉంది. ఇప్పుడు వారు ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఎక్కడో పొరపాటు జరిగింది. దాన్ని సవరించుకుంటే బావుంటుంది. అలాకాకుండా నా పరువుకు భంగం కలిగే విధంగా వారు ప్రకటనలు చేయడం సరైన పద్ధతి కాదు.

తప్పంతా వారివద్ద పెట్టుకుని నామీద పోలీస్ కేసు పెడతానని అంటున్నారు. వారు నాకు తెలుగు రోబోను అమ్మిన మాట వాస్తవం అయినప్పటికీ అది నిజం కాదు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నాకు సినిమా ఇవ్వనీ.. ఇవ్వకపోనీ ఇలాంటి జిమ్మిక్కులు చేసి సినిమా పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తే దేవుడు వారిని క్షమించడు. వారు రెండు రోజుల నుండి నిరాధారమైన విషయాలు చెపుతున్నప్పటికీ వివాదం ఎందుకులే అని నేను ఊరుకున్నాను. ప్రస్తుతం వివాదాలు లేకుండా నాకు చెడ్డ పేరు రాకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అన్నారు.

వెబ్దునియా పై చదవండి