నా పర్మిషన్ తప్పనిసరి.. ఇళయరాజా ఆగ్రహం..!

బుధవారం, 4 మార్చి 2015 (19:00 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటలు ఉన్నాయంటే ఆ సినిమా హిట్టు తప్పనిసరి. అంతటి స్థాయిలో ఆయన పాటలు వినసొంపుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మధురంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అయితే తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీలు, రేడియో ఛానళ్లలో ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి విక్రయిస్తుండడంపై ఇళయరాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అంతటితో ఆగక, తన పాటలను సీడీల రూపంలో, ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ రూపంలో అమ్ముతున్న ఐదు ఆడియో కంపెనీలపై ఇళయరాజా కేసు పెట్టారు. మద్రాసు హైకోర్టు కూడా ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై తన పాటలు ఎవరు ఎక్కడ వాడాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే, తన వద్ద రైట్స్ కొనుక్కోవాల్సిందే అని ఇళయరాజా స్పష్టం చేశారు.
 
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. 1970 నుండి పాటలను స్వర పరుస్తున్నట్టు తెలిపారు. తాను ఇప్పటి వరకు 4500 పాటలను కంపోజ్ చేశానన్నారు. తాను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు తనవే అని.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ ప్రకటన విడుదల చేశారు. 
 
తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను పాటలను కంపోజ్ చేసి,  వాటిని సినిమాల కోసం అమ్ముకున్నానన్నారు. కానీ కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం ఆ పాటలపై సర్వ హక్కులు మాత్రం తనవే నని తేల్చి చెప్పారు. కనుక తన అనుమతి లేకుండా ఇతరులు తన పాటలను వాడటానికి వీలు లేదని ఇళయ రాజా తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి