జయసుధకు ఓడిపోతానని ముందే తెలుసా...నటకిరీటికి 237.. సహజ నటికి 152 ఓట్లు

శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (21:49 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ ఎన్నికలు... ఓట్ల లెక్కింపు విషయానికి వచ్చే సమయానికి మాత్రం ఏకపక్షంగా జరిగినట్టు తేలిపోయింది. 
 
ఈ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. ఈ ఎన్నికల సందర్భంగా తానిచ్చిన మాటను మర్చిపోవడం అనేది లేదని  తేల్చి చెప్పారు. తనకు ఎవరైనా ఇచ్చిన సలహాను కూడా మర్చిపోనని అన్నారు. ఇకపై తాను 'మా'కు ఏం చేయాలో అంతా చేస్తానని చెప్పాడు. ముందు నిధులు సమీకరిస్తానని, 'మా'కు కార్యాలయం ఏర్పాటు చేస్తానని, అనంతరం పేద సినీ కళాకారులకు బీమా చేయిస్తానని భరోసా ఇచ్చారు.
 
గతంలో ఏం జరిగిందో అదంతా పక్కన పెడితే, 'మా' సౌఖ్యమే అందరికీ కావాల్సిందని, దానిని తాను పూర్తి చేస్తానని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశాడు. కొద్దిరోజులు తనపై అభాండాలు వేసిన వారిని ఏడవనివ్వమని అన్నాడు. మాలో అర్హులందరికీ సభ్యత్వం కల్పిస్తానని, లక్ష రూపాయల సభ్యత్వంపై అందరితో కూర్చుని చర్చిస్తానని రాజేంద్రప్రసాద్ వెల్లడించాడు.
 
కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అయితే, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు 237 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి సహజనటి జయసుధకు 152 ఓట్లు వచ్చినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన 85 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపాయి. కాగా, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా విజయం సాధించారు. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, 'మా'కు భవనం కడతామని ఆయన తెలిపారు. హామీలు నేరవేరితేనే తమ గెలుపునకు సార్థకత ఏర్పడుతుందని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి