ఉదయ్ కిరణ్ మృతి: చిరంజీవి కారణం కాదు.. ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్!

గురువారం, 21 ఆగస్టు 2014 (09:14 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యువ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసు మరచిపోయిన కొన్ని నెలలకు ఈ విషయం మరోమారు మీడియాకెక్కింది. ఉదయ్ మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు బంజారా హిల్స్ పోలీసులకు అందింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక అందేవరకూ ఆత్మహత్యగా భావించని పోలీసులు.. ఉదయ్ కిరణ్‌ది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడం వల్ల ఇప్పటి వరకు చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఊపిరి ఆడకపోవడం వల్లనే ఉదయకిరణ్ మరణించినట్టు ఈ రిపోర్టు స్పష్టం చేసింది. కాగా, జనవరి 5న ఉదయ్‌ కిరణ్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
 
చిత్ర పరిశ్రమలో ఎదగలేకపోతున్నాననే మానసిక ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా రెండుమూడ్లు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద మృతి కేసును త్వరలో ఆత్మహత్య కేసుగా మార్చి మూసి వేసే అవకాశాలు ఉన్నాయి. 
 
మరోవైపు.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులే కారణమంటూ ఆ నాడు అనేక విమర్శలు వచ్చాయి. వీటిపై పలువురు పలు విధాలుగా సోషల్ నెట్వర్క్ సైట్లలో కామెంట్స్ పోస్టు చేశారు. ఇపుడు.. ఫోరెన్సిక్ రిపోర్టు మరోలా వచ్చింది. మరి అపుడు నోరు జారిన వారు ఇపుడు ఏమని సమాధానం చెపుతారో వారికే తెలియాలి. 
 
 
 
 
 
 

వెబ్దునియా పై చదవండి