సీతాదేవి పాత్రలో నయన నటించడమా? వద్దొద్దు..!?: హెచ్ఎమ్‌కె

FILE
బాలకృష్ణ శ్రీరాముడిగా నటించే పౌరాణిక చిత్రం "శ్రీరామరాజ్యం" షూటింగ్.. కార్తీక సోమవారమైన నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో అందాల నయనతార నటించడం సరికాదని హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎమ్‌కె) తెలిపింది. ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడి పౌరాణిక చిత్రంలో సీతాదేవిగా నయనతార నటించడం తగదని హెచ్ఎమ్‌కె పేర్కొంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు అయిన ప్రభుదేవాను రెండోసారి పెళ్లాడనున్న నయనతార సీతాదేవి పాత్రలో నటించకూడదని హెచ్ఎమ్‌కె ప్రధాన కార్యదర్శి కణ్ణన్ తెలిపారు. వేరొక మహిళకు భర్త అయిన ప్రభుదేవాను కోరుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నయనతార సీత పాత్రలో నటించడం ఎంతవరకు సబబు అని కణ్ణన్ ప్రశ్నించారు.

ఇప్పటికే మల్లికా షెరావత్, శ్రియా చరణ్ కురుచ దుస్తులు ధరించడంపై మండిపడిన హెచ్ఎమ్‌కె, ఖుష్బూ వ్యాఖ్యలు, అసిన్ శ్రీలంక టూర్, రామ్ గోపాల్ ‌వర్మ రక్త చరిత్ర సినిమాలపై కూడా హెచ్ఎమ్‌కె అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు అతి త్వరలోనే నయనతారను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుదేవా మొదటి భార్య రామలత ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫ్యామిలీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

కానీ లవ్ బర్డ్స్ నయన, ప్రభుదేవాలు ఈసారి కూడా కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. అలాగే న్యాయస్థానం పంపిన సమన్లను ప్రభుదేవా, నయనలు తిరస్కరించారు. దీంతో న్యాయస్థానం మూడో సారి సమన్లు పంపించాలని పేర్కొంది. ఇంకా ప్రభుదేవా, నయనతారలు జనవరి 21న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి