ఆస్ట్రోనాట్‌గా అమీర్ ఖాన్.. సోషల్ మీడియాలో ఫోటోల హల్ చల్..!

గురువారం, 9 జూన్ 2016 (13:05 IST)
ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా త్వరలోనే మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. నిజ జీవిత కథలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాలను రూపొందించడానికి దర్శక, నిర్మాతలు పోటీపడుతున్నారు. అసలు విషయానికొస్తే... బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో ఓ బయోపిక్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇంతకీ ఎవరి బయోపిక్‌లో నటిస్తున్నాడో తెలుసా..? ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మలా కనిపించనున్నారట. ఈ సినిమాలో వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత చరిత్రను చూపించనున్నారు.
 
రాకేష్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అంతరక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఆయన. 1984 ఏప్రియల్ 3న రష్యాకు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి, బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రపంచపు వ్యోమగాములల్లో రాకేష్ శర్మ..138 వ వాడు. అంతరిక్షంలో ఆయన చేసిన సాహసాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని అమీర్ ఖాన్ భావిస్తున్నాడట. 
 
ఒక వేళ ఇదే కనుక నిజమైతే తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటికే అమీర్‌ను ''ఆస్ట్రోనాట్'‌'గా మార్చిన అభిమానులు ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. భారత చలన చిత్రపరిశ్రమలోనే ఇది అతిపెద్ద సాహస చిత్రంగా కానుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి