ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు వెంటనే భారత్ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్ నుంచి భారత్ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు. ఈ విషయంపై రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు.
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ ( సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది. దేశభక్తిభావం, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని సీవోఈఏఐ అధ్యక్షుడు నితిన్ దతర్ తెలిపిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం చిక్కుల్లో పడింది. అసలు విషయం ఏంటంటే...ఈ చిత్రంలో పాక్ నటుడు ఫవాద్‌ఖాన్ నటించాడు. ఈ నేపథ్యంలో దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు పాక్ నటీనటులున్న సినిమాలను ఆడనివ్వమని తేల్చిచెప్పేశారు.