"వకీల్ సాబ్" కలెక్షన్లపై కరోనా ప్రభావం?

బుధవారం, 14 ఏప్రియల్ 2021 (18:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "వకీల్ సాబ్". ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ 'వకీల్ సాబ్' ప్రయాణం తొలి ఐదు రోజులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. 
 
ఒకవైపు వైరస్ విజృంభిస్తున్నా కూడా మరోవైపు థియేటర్లకు అభిమానులు, ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కరోనా వైరస్ అనే విషయాన్ని కూడా వాళ్లు మరిచిపోయారు. అందుకే కలెక్షన్లు కూడా అద్భుతంగా వచ్చాయి. 
 
పైగా ఉగాది సెలవులు కూడా రావడంతో తొలి ఐదు రోజులు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు వకీల్ సాబ్. అయితే ఆ రోజు నుంచి ఈ సినిమా దూకుడు తగ్గింది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్స్ నెమ్మదించాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
 
వైరస్ ఉన్నా కూడా పవర్ స్టార్ మేనియాతో తొలి ఐదు రోజులు ఎదురు లేకుండా వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసేయడం.. మరోవైపు రోజురోజుకు కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అందుకే 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయని సమాచారం. 
 
మ్యాట్నీస్ కూడా 50 శాతం మాత్రమే ఫుల్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఉగాది పర్వదిన రోజున 'వకీల్ సాబ్' తెలుగు రాష్ట్రాల్లో కలెషన్ల పరంగా కుమ్మేసింది. సెలవు రోజు కావడంతో దాదాపు రూ.9 కోట్ల షేర్ తీసుకొచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే దాదాపు రూ.76 కోట్లు వకీల్ సాబ్ వసూలు చేసిందని తెలుస్తోంది. 
 
ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే రూ.90 కోట్లు వసూలు చేయాలి. వైరస్ కారణంగా ఇప్పటికే సినిమాలన్నీ వాయిదా వేస్తూ ఉండడంతో ప్రేక్షకులకు పవన్ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు. అలాగే మెల్లగా నడుస్తూ నడుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటుందని డిస్ట్రిబ్యూటర్లు బలంగా నమ్ముతున్నారు.
 
ఏదేమైనా కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి.. దానికి ఎదురు నిలిచి ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం మాత్రం చిన్న విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరో చేయని సాహసం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు