తాను నిర్వహించిన ఈవెంట్ల సందర్భంగా ప్రముఖులకు వారి ఇష్టంమేరకు డ్రగ్స్‌ను సరఫరాచేశానని హీరో నవదీప్ సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఈవెంట్లు, పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంటాయి? అనే విషయాల్లోనూ కీలక సమాచారాన్ని బయటపెట్టినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్ విచారణలో భాగంగా యువ నటుడు నవదీప్ వద్ద సిట్ అధికారులు సోమవారం 11 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ విచారణలో అనేక ఆధారాలు చూపెడుతూ విచారించడంతో అన్ని విషయాలను ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, బెల్జియం, థాయ్‌లాండ్‌లతో పాటు, దేశంలోని గోవా, ఊటీ, కొడైకెనాల్, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ప్రముఖులకు చెందిన పెద్దపెద్ద ఈవెంట్లను నిర్వహించినట్టు అంగీకరించారని తెలిసింది.
సదరు ఈవెంట్లకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కలుగజేసి, వారిని ఆనందపరిచేందుకు వారి ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలను అందజేశామని చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు వివిధ రకాల ప్రశ్నలతో నవదీప్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. డ్రగ్ మాఫియా కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన అధికారులు.. కెల్విన్ మొబైల్ కాల్‌డాటాలో నవదీప్ నంబర్ ప్రముఖంగా ఉండటాన్ని చూపి ప్రశ్నించినట్టు తెలిసింది.
అలాగే, హైదరాబాద్‌లో పేరుగాంచిన బీపీఎం పబ్బులో తాను భాగస్వామిగా ఉన్నది వాస్తవమేనని ఒప్పుకున్నట్టు సమాచారం. సంపన్నులు ఆటవిడుపు కోసం వచ్చే పబ్బులు, క్లబ్బులన్నీ మత్తుకేంద్రాలుగా మారుతున్నాయని చెప్పిన నవదీప్.. పబ్ కల్చర్ నగరాలను మత్తులో ముంచేస్తున్నదని అన్నారని సమాచారం. కాగా, నవదీప్ వద్ద విచారణ ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ సుదీర్ఘంగా సాగి, రాత్రి 9.45 గంటలకు ముగిసింది. అతడి రక్తనమూనాలతో పాటు, వెంట్రుకలు, గోర్లు సేకరించడానికి అనుమతి కోరారు. దీనికి నవదీప్ నిరాకరించడంతో ఎలాంటి నమూనాలను సేకరించలేదు.