అక్కినేని అఖిల్ రెండో సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథను ఓకే చేసిన ఈ హీరో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తెచ్చే పనుల్లో ఉన్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, జనవరి నుంచి కొత్త సినిమాను సెట్స్ మీదకు వెళ్లే రెండో సినిమాలో నటించనున్నాడు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. టాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా పరిచయమైన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత నాగ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన టబుకు అక్కినేని ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి.
అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌కు రెడీ అవుతోంది. నాగార్జున స్వయంగా టబును అడగటంతో అఖిల్ సినిమాలో స్పెషల్ రోల్ పోషించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే కనుక నిజమైతే టబు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుందన్నమాట.