మరోవైపు చిన్న నిర్మాతలందరూ తమ షూటింగ్‌లు జరుపుకుంటామనీ, గిల్డ్ నిర్మాతలులా కోట్లు రూపాయలు ఇచ్చి తాము హీరోలను తెచ్చుకోవడంలేదని అంటున్నారు. ఇంకోవైపు 24 క్రాఫ్ట్‌కు చెందిన సినీకార్మిక సమాఖ్య అద్యక్ష, కార్యదర్శకులు వల్లభనేని అనిల్, దొర మాత్రం తమకు ఛాంబర్ నుంచి షూటింగ్‌లు బంద్ అని ఎటువంటి సమాచారం లిఖితపూర్వకంగా రాలేదని తేల్చిచెప్పారు. ఇంకోవైపు తెలంగాణ ఛాంబర్ మాత్రం అసలు గిల్డ్ అనేది సంస్థేకాదు. అది కొందరు స్వార్థపరుల అడ్డా అంటూ తేల్చిచెబుతున్నారు. ఇన్ని వివాదాల మద్య ఇప్పుడు గిల్డ్ నిర్మాతలు సమావేశం అవ్వాల్సి వచ్చింది. అందుకు ప్లేస్ కూడా మార్చారు. మీడియాకు దూరంగా సమావేశం వేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు, గిల్డ్ అనేది వుండబోదని తెలుస్తోంది. మొదటి నుంచి నిర్మాతలమండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎలా వుందో దానిప్రకారమే అన్ని పనులు జరగాలని ఇండస్ట్రీ పెద్దలనుంచి ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారు. అందుకే మానవతా దృక్పథంతో వారికి పని కల్పించే బాద్యత తమదేనని పలువురు నిర్మాతలు సూచించారని తెలుస్తోంది.