'ఐ' హక్కుల కోసం పోటాపోటీ.. తెలుగు వెర్షన్ బిజినెస్ క్లోజ్!

మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:28 IST)
సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, తమిళ హీరో విక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఐ. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా.. 'ఐ' సినిమా తెలుగు హక్కులు కొనేందుకు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు రజనీకాంత్ 'రోబో' తెలుగు హక్కులు అత్యధికంగా 27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. పర భాషల నుంచి తెలుగులోకి వచ్చే డబ్బింగ్ చిత్రాల్లో ఇదే రికార్డుగా ఉంది. అయితే, విక్రమ్ తాజా చిత్రం 'ఐ' మాత్రం ఈ రికార్డును తిరగరాసేలా ఉంది. 
 
ఇప్పటికే 'ఐ' నైజాం హక్కులను 10 కోట్లకు, వైజాగ్ ఏరియా హక్కులను 5 కోట్లకు, ఉభయ గోదావరి జిల్లాల హక్కులను 2.5 కోట్లకు పంపిణీదారులు కొనుగోలు చేశారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. మిగతా ఏరియాల బిజినెస్ కూడా పూర్తయితే దాదాపు 30 కోట్ల బిజినెస్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందే 'ఐ' చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అలాగే, మిగిలిన ఏరియాల నుంచి కూడా ఫ్యాన్సీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు 'ఐ' నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మొత్తంమీద 'ఐ' తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజెనెస్ పూర్తిగా క్లోజ్ అవుతుందని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి