మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమేకాకుండా కనకవర్షం కురిపిస్తూ... టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీకి గ్రాండ్ వెల్‌కమ్‌గా మారింది.
ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా విడుదలైంది. అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంటే ఓవర్సీస్‌లో కూడా "బాస్ ఈజ్ బ్యాక్" మానియా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా 'ఖైదీ' చిత్ర ప్రదర్శనను తిలకించారట. దీనికి సంబంధించి ట్విట్టర్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, చిరంజీవికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించినట్లు కొన్ని వెబ్‌సైట్లు వార్తలు కూడా రాసేశాయి.
ఈ వార్తలో నిజానిజాలెంతో పరిశీలించగా, ఇదో ఫేక్ వార్త అని తేలిపోయింది. చిరంజీవి మూవీ 11వ తేదీన విడుదలైతే జనవరి 10వ తేదీనే ట్రంప్ చిత్రాన్ని చూసి ట్విట్టర్‌లో కామెంట్స్ చేసినట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని కొందరు గుడ్డిగా ప్రచారంలో పెట్టేశారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడానికి రష్యా సాయం తీసుకున్నారనే విమర్శలపై వివరణ ఇచ్చుకోలేక సతమతమవుతున్నారు.