‘క్లైమాక్స్‌’ మోడీ, మాల్యా బ‌యోపిక్ కాదుః దర్శకుడు భవానీ శంకర్‌

బుధవారం, 3 మార్చి 2021 (16:57 IST)
Director Bhavani Shankar
‘డ్రీమ్‌’ సినిమాతో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు భవానీ శంకర్‌. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘క్లైమాక్స్‌’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించారు. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రాజేశ్వర్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి నిర్మించారు. సాషా సింగ్‌, ‘30 ఇయర్స్‌’ పృథ్వీ, శివశంకర్‌ మాస్టర్‌, శ్రీరెడ్డి ,రమేశ్‌ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 5న (శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు భవానీ శంకర్‌ ఇంటర్వ్యూ విశేషాలు.
 
సినిమాకు ‘క్లైమాక్స్‌’ అని టైటిల్‌ పెట్టారు. అసలు, కథేంటి?
సినిమా మొత్తం రివీల్‌ అయ్యేది క్లైమాక్స్‌లో కాబట్టి ‘క్లైమాక్స్‌’ అని టైటిల్‌ పెట్టాం. ఇదొక మర్డర్‌ మిస్టరీ. మెయిన్‌ పోస్టర్‌ చూస్తే రాజేంద్రప్రసాద్‌గారికి ఓ వైపు సాషా సింగ్‌, శివశంకర్‌ మాస్టర్‌ మరోవైపు శ్రీరెడ్డి, పృథ్వీ ఉంటారు. అటు, ఇటు ఉన్నవాళ్లు మర్డర్‌ మిస్టరీలో అనుమానితులు. అందుకని, అలా డిజైన్‌ చేశాం. ఎవరు మర్డర్‌ చేశారనేది క్లైమాక్స్‌లో రివీల్‌ అవుతుంది.
 
హత్యకు గురయ్యేది ఎవరు?
మర్డర్‌ రాజేంద్రప్రసాద్‌గారిదే. అయితే, ఆయన సినిమా అంతా ఉంటారు. మాములుగా మర్డర్‌ మిస్టరీ స్టోరీలన్నీ ఇన్వెస్టిగేటివ్‌ జానర్‌లో వెళ్తుంటాయి. కొత్తరకంగా తీయాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇన్వెస్టిగేటివ్‌ వేలో వెళ్లకుండా కామెడీగా తీయవచ్చా? అని ఆలోచించి చేశా. ఓ ప్రయోగం అని చెప్పాలి. సినిమాలో కామెడీ ఉంటుంది. అదే సమయంలో థ్రిల్‌, టెన్షన్‌ పెట్టే అంశాలూ ఉన్నాయి.
 
సినిమాలో కాంటెంపరరీ ఇష్యూలను టచ్‌ చేశారా?
మర్డర్‌ మిస్టరీలో ఇన్వెస్టిగేటివ్‌ జానర్‌ తీసేశా. కామెడీగా చెప్పా. రెండోది. పొలిటికల్‌ సైటర్‌ చెప్పా. కథలో మిళితమై పొలిటికల్‌సెటైర్స్‌ ఉంటాయి.
 
హీరోకి మోడీ అని పేరు పెట్టడం వెనుక కారణం ఏంటి?
ఇప్పుడు చెబితే సినిమా క్లైమాక్స్‌లో థ్రిల్‌, కిక్‌ ఉండదు. సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే మోడీ అని పేరు పెట్టడం సరైన నిర్ణయమని కచ్చితంగా చెబుతారు. తప్పని ఎవరూ అనరు. సెన్సార్‌సమయంలోనూ ‘మోడీ అని ఎందుకు పేరు పెట్టాలి? ఇన్ని పేర్లు ఉన్నాయి కదా’ అనే ప్రశ్న ఎదురైంది. సినిమా చూశాక... సెన్సార్‌ వాళ్లు ఆ ప్రశ్న అడగలేదు. ట్రైలర్‌ టైమ్‌లో కొంత అబ్జక్షన్‌ వచ్చింది. మోడీ పేరుకు సినిమాలో ప్రాముఖ్యం ఉంది. అదేంటో ఎండింగ్‌ వరకూ తెలియదు.
 
ట్రైలర్‌లో బోల్డంత డబ్బు చూపించారు. స్కామ్‌ వంటిది ఏమైనా వుందా?
ఓ మల్టీ మిలీనియర్‌ ఇంట్లో ఉండకుండా స్టార్ హోటల్‌లోని సూట్‌ రూమ్‌లో ఉంటాడు. భార్యాబిడ్డలు ఉన్నా ఇంట్లో ఉండడు. అతని లైఫ్‌ స్టయిల్‌ అలా ఉంటుంది. స్టార్‌ హోటల్‌లో సూట్‌ రూమ్‌లో 500 కోట్ల రూపాయలు పెట్టి ఉంటారు. ఆయన సడన్‌గా చనిపోతారు. డబ్బు కనిపించదు. డబ్బు ఏమైంది? ఎవరు చంపారు? అన్నది కథ.
 
స్టార్‌ హోటల్‌, లగ్జరీ లైఫ్‌ స్టయిల్‌ విజయ్‌ మాల్యాను గుర్తుకు తెస్తుందని అనుకోవచ్చా?
డెఫనెట్‌గా గుర్తుకు తేవాలనే పెట్టాం. వాళ్ల జీవితాలకు సంబంధించినది కాదు. వాళ్ల బయోపిక్‌ కాదు. కానీ, సినిమాలో హీరో పేరుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదేంటో క్లైమాక్స్‌లో తెలుస్తుంది. ట్రైలర్‌లో కూడా ఎందరో మాల్యాలు, ఎందరో మోడీలు అని ఓ డైలాగ్‌ పెట్టాను. అది ఎండింగ్‌లో వస్తుంది.
 
కానీ, విజయ్‌ మోడీ అని పేరు పెట్టారు కదా!
అవును. ఆ పేరు మీద రకరకాల కామెంట్లు వినిపించాయి. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ పేర్లు కలిపి పెట్టామని అన్నారు. అటువంటిది ఏమీ లేదు. మోడీ పేరు మీద కాంట్రవర్సీలు లేకుండా విజయ్‌ మోడీ అని పెట్టాం. ఫస్ట్‌, రాజేంద్ర మోడీ అని పెట్టాను. తర్వాత విజయ్‌ మోడీ అని మార్చాను.
 
ట్రైలర్‌లో మోడీ డౌన్‌ డౌన్‌ నినాదాలపై విమర్శలు వచ్చాయి. వాటిపై మీ స్పందన?
చాలా ట్రోల్స్‌ వచ్చాయి. చాలామంది మోడీ అంటే నరేంద్రమోడీ అనుకున్నారు. కాదని అందరికీ చెప్పలేను కదా! ఐపీఎల్‌లో స్కామ్‌ చేసిన లలిత్‌ మోడీ, బ్యాంక్‌ స్కామ్‌ చేసిన నీరవ్‌ మోడీ చెప్పుకొంటూ వెళితే బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. విజయ్‌ మాల్యా మరో ఉదాహరణ. ప్రధానమంత్రిని నేనెందుకు టార్గెట్‌ చేస్తా? చేయకూడదు. చేయను కూడా! నిజం చెప్పాలంటే ట్రైలర్‌ ఓపెనింగ్‌లో ఆ షాట్స్‌ ముందు లేవు. ట్రైలర్‌ కట్‌ చేసిన వ్యక్తి జనాల్లోకి బాగా వెళ్తుందని పెట్టారు.
 
రాజేంద్రప్రసాద్‌కి ఈ రోల్‌ గురించి చెప్పినప్పుడు ఏమన్నారు?
మొదట కొంచెం డౌట్‌ పడ్డారు. ‘భవానీ, ఇరికించే ప్రోగ్రామ్‌ ఏం లేదు కదా?’ అన్నారు. పూర్తి కథ విన్న తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. డైలాగ్స్‌ విని షాకయ్యారు. ఒక్కో డైలాగ్‌ చాలా ఆలోచించి రాశా. ఏ సీనూ, ఏ డైలాగూ ఇంకో సినిమాలో కనపడడు. ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఇంకొకటి, సినిమా నిడివి గంటన్నర మాత్రమే. గంటన్నరలో చిన్న సినిమా తీయడం ఓ ప్రయోగం. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఎక్కువ నిడివి సినిమా చూపిస్తే ప్రమాదమని నిడివి తక్కువ ఉండేలా చూసుకున్నా. చిన్న సినిమాలకు గంటన్నరలో తీయాలనే ట్రెండ్‌ వస్తే ఫస్ట్‌ అడ్వాంటేజ్‌, ప్రొడక్షన్‌ కాస్ట్‌ తగ్గుతుంది. థియేటర్లలో ఐదు షోలు వేసుకోవచ్చు. ట్రెండ్‌ అవ్వాలంటే ఇటువంటి సినిమాలు హిట్‌ అవ్వాలి.
 
Climax cast
రాజేంద్రప్రసాద్‌గారిని ఎంపిక చేసుకోవాడానికి కారణం?
కథ రాస్తున్న సమయంలో రాజేంద్రప్రసాద్‌గారు నా మైండ్‌లో ఎక్కడా లేరు. కథను కథగా రాశా. ‘డ్రీమ్‌’ కూడా అలాగే రాశా. ‘క్లైమాక్స్‌’కి ఎవరు సూట్‌ అవుతారని చూస్తే మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ కనిపించారు. ఇది 60 ఏళ్ల వయసున్న వ్యక్తి కథ. రాజేంద్రప్రసాద్‌గారిని కలిశాం. వెంటనే సినిమా చేశాం. సినిమాలో హీరోకి మూడు కోరికలు ఉంటాయి. ఒకటి, ఫేమస్‌ అవ్వాలి. రెండు, రాజకీయ నాయకుడు కావాలి. మూడు, సినిమా తీయాలి. అతనేం చేశాడన్నది కథ.
 
ఆయన గెటప్‌ స్పెషల్‌గా డిజైన్‌ చేయించినట్టు ఉన్పారు?
అవును. ‘డ్రీమ్‌’లో ఆయన నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. కానీ, ఈ సినిమాలో ఒక గెటప్‌. కానీ మేకప్‌కి చాలా టైమ్‌ తీసుకుంది. సుమారు గంట పట్టింది.
 
రాజేంద్రప్రసాద్‌గారితో ఓ పాట కూడా పాడించారు. పాట పాడాలని అన్నప్పుడు ఆయన ఏమన్నారు?
సాధారణంగా పేదల కష్టాలు పాటల్లో చెబుతుంటారు కదా! గొప్పోడికి కష్టాలు ఏముంటాయని అనుకుంటారు. ఆ కష్టాలు పాట రూపంలో రాసి తీసుకొచ్చాం. ఫస్ట్‌ ర్యాప్‌ సాంగ్‌ వేరేవాళ్లతో పాడించాం. తర్వాత రాజేంద్రప్రసాద్‌ ఎందుకు పాడకూడదని ఆయనతో పాడించాం. పాడాలని చెప్పగానే ఆయన చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఇన్నేళ్లుగా ఆయన ఎన్నో పాత్రలు చేశారు. కొత్తగా చేయాలని కోరుకుంటున్నారు.
 
సినిమాలో శ్రీరెడ్డి చేత ఆమె రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ చేయించారట?
కరెక్ట్‌. ఫస్ట్‌ నేను అంత ఆలోచించలేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమెను సెలక్ట్‌ చేసి, సినిమా చేశాం. తర్వాత ట్రోల్స్‌ చూసేంత వరకూ అర్థం కాలేదు. ఆమెతో సినిమా చేయడం వలన అంతమంది రియాక్ట్‌ అవుతారనుకోలేదు. కాంట్రవర్షియల్‌ అని తెలుసు. ఆమెది చాలా చిన్న రోల్‌. స్పెషల్‌ అప్పియరెన్స్‌. సినిమాలో రాజేంద్రప్రసాద్‌ ఇంకో సినిమా తీస్తారు. ఆయన్ని చూసి ఎవరూ టికెట్‌ కొనరని, కాంట్రవర్షియల్‌ హీరోయిన్‌ని తీసుకోవాలని శ్రీరెడ్డిని సెలెక్ట్‌ చేస్తారు. అదీ సంగతి.
 
‘డ్రీమ్‌’ తర్వాత మీకు కొంత విరామం వచ్చింది. ఎందుకు?
‘డ్రీమ్‌’ తర్వాత గ్రీక్‌లో ఒక సినిమా చేశా. గ్రీక్‌ ఫిల్మ్‌ సెంటర్‌ వాళ్లు అవార్డ్‌ విన్నింగ్‌ దర్శకులతో సినిమాలు ప్రొడ్యూస్‌ చేస్తారు. కొన్ని సమస్యల వల్ల అది ఆలస్యమైంది. మూడేళ్లు పట్టింది.
 
మీ తదుపరి సినిమా?
‘క్లైమాక్స్‌’ నిర్మాతలతో రెండు సినిమాలకు సంతకం చేశా. వాళ్లతో మరో సినిమా చేస్తున్నా. టైటిల్‌ ‘17’. పదిహేడేళ్ల వయసున్న నలుగురి అమ్మాయిల కథ. టీనేజర్‌ డ్రామా. కొంత షూటింగ్‌ చేశాం. త్వరలో పూర్తి చేస్తాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు