ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతేనా అనేక మంది అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశారు. అలా రాష్ట్ర డీజీపీ ఈ చిత్రాన్ని ఏకంగా 70 సార్లు చూశారట. ఆ డీజీపీ ఎవరో కాదు... నండూరి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ.
గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాల విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, శ్రీమంతుడు చిత్రంలో చివర్లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగు తనకు బాగా ఇష్టమన్నారు.
"అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు" అన్న డైలాగ్‌ను చెప్పారు. విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు.