షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజలను కించపరిచేలా మాట్లాడిన సినీ నటి, జాతీయ మహిళా సంఘం సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తమిళనాడు రాష్ట్రంలోని వీసీకే పార్టీ చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులు మాట్లాడే భాషను ఆమె కించపరిచేలా మాట్లాడారని అందువల్ల ఆమెపై కేసు నమోదు చేయాలని వీసీకే నేతలు డిమాండ్ చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ ఎస్సీ ఎస్టీ విభాగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎస్సీ విభాగం అధ్యక్షుడు రంజన్ కుమార్ మాట్లాడుతూ, దళితులను కించపరిచేలా మాట్లాడిన ఖుష్బూ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కాగా, సహ నటి త్రిష విషయంలో తీవ్రంగా స్పందించిన ఖుష్బూ... మణిపూర్ మహిళలపై జరిగిన అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాజా వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటిని శుక్రవారం సాయంత్రం ముట్టడిస్తామని హెచ్చరించా. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీ భద్రత కల్పించారు. అయితే, ముట్టడి వాయిదా నేపథ్యంలో ఆమె ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు.