బాహుబలి 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2:ద కన్ క్లూజన్ సినిమా రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా అద్భుత వసూళ్లతో తిరుగులేని విజయం సాధించింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన బాహుబలి.. తాజాగా వసూళ్ల ఖాతాలో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా "బాహుబలి 2: ద కన్ క్లూజన్" నిలిచిందని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్స్ ట్వీట్ చేశాడు.
ఈ సినిమా దేశవ్యాప్తంగా కేవలం హిందీ భాషలోనే 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ఆదర్శ్ చెప్పాడు. హిందీలో 2014లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన పీకే (300 కోట్ల రూపాయలు), దాని తరువాత 2009లో విడుదలైన త్రీ ఈడియట్స్ 200 కోట్ల రూపాయలతో, అనంతరం 2008లో విడుదలైన గజిని (100 కోట్లు), నిలిచాయని తరణ్ ఆదర్శ్ తెలిపాడు.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమా రికార్డులను చెరిపేసింది. ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లను సాధించిన బాహుబలి చిత్రాలు రాబోయ్ సినిమాలకు సరికొత్త టార్గెట్స్‌ను సెట్ చేశాయి. ముఖ్యంగా సౌత్‌లో భారీగా తెరకెక్కుతున్న రోబో సినిమా సీక్వల్ 2.0 యూనిట్ బాహుబలి రికార్డ్‌లను బద్ధలు కొట్టేందుక రెడీ అవుతోంది.
అయితే బాహుబలి రికార్డ్‌లను చెరిపేయాలంటే ఇది సరిపోదని భావిస్తున్న 2.0 యూనిట్ తమ సినిమాను ఏకంగా 15 భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ్, తెలుగు, మలాయళం, హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.