నేను మందలోని గొర్రెను కాదు.. నేను వేరే జంతువును : 'బాహుబలి'పై కమల్ హాసన్ కామెంట్స్

ఆదివారం, 21 మే 2017 (14:45 IST)
తమిళ అగ్ర నటుల్లో కమల్ హాసన్ ఒకరు. విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. బాహుబలి చిత్ర విజయంపై ఇప్పటివరకు ఒక్క కామెంట్ కూడా చేయలేదు. దీనిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారతీయ చిత్రపరిశ్రమలో అనితరసాధ్యమైన 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఏకైక సినిమా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
'బాహుబలి' సినిమా మహాభారతానికి, తమిళ ఫాంటసీ టీవీ సిరీస్ 'అంబులి మామ'కు నకలు అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. 'బాహుబలి' సినిమా తనపై ఎలాంటి ఒత్తిడి పెంచదని తేల్చిచెప్పాడు. గొర్రెలన్నీ ఒకదాని వెనుక ఒకటి వెళ్తాయని, మందతో కలిసి ముందుకు పోవడానికి తానేమీ గొర్రెను కానని ఆయన స్పష్టం చేశాడు. అంతే కాకుండా తాను కనీసం ఆ గొర్రెల మందను నడిపించే కాపరిని కూడా కాదని స్పష్టం చేశాడు. తాను వేరే జంతువునని, కొంత తేడా జంతువునని కూడా పేర్కొన్నాడు.
 
'మరుదనాయగం' సినిమా గురించి అభిమానులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తాను ఆ సినిమాను ఎప్పుడో పట్టాలెక్కించాలని భావించానని, అయితే 'మర్మయోగి' సినిమా మధ్యలో దూరి ఆ సినిమా ఆలోచనను మరింత వెనక్కి నెట్టిందని తెలిపాడు. సినీ పరిశ్రమలో అద్భుతమైన ఆలోచనలకు తలమానికమని చెప్పుకునేందుకు ఎవరూ లేరని, ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారన్నారు. 

వెబ్దునియా పై చదవండి