‘తెలంగాణ దేవుడు’కి శుభాకాంక్షలు

బుధవారం, 2 జూన్ 2021 (16:40 IST)
Telangana Devadu still
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది ‘తెలంగాణ దేవుడు’ చిత్ర టీమ్. 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. 'తెలంగాణ దేవుడు' చిత్రాన్ని రూపొందించామని తెలిపారు దర్శకనిర్మాతలు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్‌ నటించగా జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనగానే చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ, చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము’’ అని తెలిపారు.
 
చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎంతో విశిష్టమైనది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. వారందరి త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తాము. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ.. క్షేమంగా ఉండాలని మా చిత్రయూనిట్ తరపున కోరుతున్నాము’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు