చందమామ నటి సింధుమీనన్‌పై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ బ్యాంకును మోసం చేసిందని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లీజుకు తీసుకున్న భవనాన్ని తాకట్టు పెట్టే యత్నంలో నకిలీ పత్రాలను సింధు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు సింధు మీనన్‌తో పాటు ఆమె సోదరుడు మనోజ్ కార్తీపైన కూడా కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే, మనోజ్ కార్తీ, సింధు, మరో ఇద్దరు కలిసి గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ భవనాన్ని తమదిగా చూపి బ్యాంకు రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి.. చిక్కుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులను ఆశ్రయించడంతో సింధుమీనన్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె సోదరుడిపై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ నకిలీ పత్రంలో సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇందుకు సింధు మూడో గ్యారంటర్‌గా ఉంది. తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.