'ఖైదీ నం.150' ఫంక్షన్ వేదిక మార్పునకు కారణాలు చిరంజీవే వివరిస్తారు: అల్లు అరవింద్

మంగళవారం, 3 జనవరి 2017 (13:09 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుక ఈనెల 7వ తేదీన జరుగనుంది. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ ఏర్పాట్లపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగాస్టార్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
 
మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా పవన్ వస్తాడా? రాడా? అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేక పోతున్నట్టు చెప్పారు. 
 
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి