కమెడియన్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!!

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (09:43 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్విరాజ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఆయన భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గతంలో మనోవర్తి విషయంలో ఇదే కోర్టు జారీచేసిన ఆదేశాలను పాటించనందుకు, హైకోర్ట్ ఆదేశాలనూ ఖాతరు చేయనందుకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 
 
మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. 
 
అప్పటివరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, సప్పా రమేష్, సీహెచ్ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు.
 
పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడినట్టు అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు