రెండ్రోజులే కదా.. కామెడీతో గడిపేస్తే తప్పించుకోవచ్చు.. దిలీప్ యవ్వారం ఇలాగుంది మరి

శనివారం, 15 జులై 2017 (10:17 IST)
తోటి నటి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఘటనలో అతగాడిది కీలకపాత్ర అని పోలీస్ యంత్రాంగం పూర్తిగా విశ్వసిస్తోంది. పక్కా ఆధారాలతో అతగాడిని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు తీరా విచారణకోసం కస్టడీలోకి తీసుకునేటప్పటికీ మీ విచారణ ఎలా ఉంటుందో చూస్తా అనే రేంజిలో వారితో ఆడుకుంటున్నాడని తెలిసింది. కోర్టు ద్వారా కస్టడీ కాబట్టి తన వంటిపై చేయి వేయడం పోలీసుల తరం కాదన్న ఆలోచనతో అతడు విచారణ సమయంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండటంతో పోలీసులకు దిక్కు తోచలేదని సమాచారం.
 
మలయాళ ​నటిపై లైంగిక వేధింపుల దాడి కేసులో అరెస్టైన మలయాళ నటుడు దిలీప్ పోలీసు విచారణలో చాలా కామెడీగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. కోర్టు అనుమతి మేరకు దిలీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులకు అతడు ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. వారు వివిధ అంశాలపై ప్రశ్నలు అడుగుతుండగా దిలీప్ అస్సలు సమాధానాలు చెప్పడం లేదని సమాచారం. 
 
పోలీసులు సీరియస్ గా ప్రశ్నలు అడిగితే దిలీప్ మాత్రం కామెడీ చేస్తున్నాడట! వాళ్లు అడిగిన ప్రశ్నలకు తింగరి తింగరిగా సమాధానాలు చెప్పడం, సీరియస్‌గా ప్రశ్నలు అడిగితే సరదా సమాధానాలు చెప్పడం, జోకులు వేయడం.. ఇదీ తీరు. పోలీసుల విచారణకు సహకరించకుండా ఇలాంటి తీరుతో దిలీప్ సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 
కోర్టు దిలీప్‌ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ రెండు రోజుల పాటు పోలీసులకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా తప్పించుకోగలిగితే.. తర్వాత బెయిల్ తెచ్చుకుని బయటపడిపోవచ్చనేది దిలీప్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే పోలీసులు ఏం అడిగినా.. సమాధానాలు చెప్పకుండా, నటుడిగా తన టాలెంట్ ను అంతా ప్రదర్శిస్తున్నాడట ఈ మలయాళీ హీరో. 
 
దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. సినిమాల్లో కామెడీ చేసిన తీరున, విచారణలో కూడా ఇతడు తింగరితింగరి మాటలతో తప్పించుకునే యత్నాన్ని చేస్తున్నాడు. దిలీప్ పక్కా క్రిమినల్ అని, ఒకవైపు తను అమాయకుడిని అంటూనే.. పోలీసుల విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్లాన్‌ను అమలు చేస్తున్నాడనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయిప్పుడు.
 
రాటుదేలిన పోలీసు వ్యవస్తకే అంతు చిక్కని విదంగా ఈ ప్రబుద్దుడు ఇంత డ్రామా ఆడుతుంటే ఇక న్యాయం జరుగుతుందని ఎలా ఆశించడం.

వెబ్దునియా పై చదవండి