గోవర్ధన్ గజ్జల దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం'. సినిమాపై తపనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి ఈ రంగంలోకి ప్రవేశించారు. అక్కడ మిత్రుల సహకారంతో నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా యు.ఎస్.లో చిత్రీకరించడం విశేషం. అక్కడ యూనివర్శిటీలో పలు నాటకాల్లో నటించిన చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా హీరోహీరోయిన్లుగా నటించారు. తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సెన్సార్ కూడా పూర్తయి ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దర్శక నిర్మాత గోవర్ధన్ విలేకరులతో చిత్రం గురించి వివరించారు. పేరు సాఫ్ట్‌గా వున్నా రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించామన్నారు. ఐదు పాటలున్నాయనీ, ఒకటి ఇంగ్లీషులో వుంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఇటు హైదరాబాద్‌లో అటు అమెరికాలో పలు దఫాలుగా పలువురు ప్రముఖులు, సన్నిహితులు, మిత్రులకు చూపించామనీ, సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారని తెలిపారు.
అలా చూసి ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) చిత్రం విడుదల విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రకాంత్, రాధికా, పల్లవిల నటన, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 17న విడుదలవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.