అమెరికాలో కేంబ్రిడ్జి నగరంలోని హార్వర్డ్ వర్సిటీ బిజినెస్ స్కూల్ కార్యక్రమంలో తమిళ సాంప్రదాయక దుస్తులు ధోవతి, చొక్కా ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ రజనీ, తాను స్నేహితులుగానే కొనసాగుతామని, అయితే రాజకీయాలు వేరని చెప్పారు. 37 ఏళ్లుగా పరోక్షంగా రాజకీయాల్లోనే ఉంటున్నానని, గాంధీ, పెరియార్‌లా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవాడినన్నారు. ఆ ఇద్దరు నేతలను ఆదర్శంగా తీసుకుని పార్టీ పేరు ప్రకటించబోతున్నానని తెలిపారు.
తన రాజకీయ పార్టీ రంగు నలుపు అని, ద్రావిడమే తన సిద్ధాంతమని, ద్రావిడమంటే పార్టీలకు సంబంధించిన విషయం కాదని, అది జాతీయపరమైనదని వివరించారు. చెన్నైలోని ఓ కళాశాల కార్యక్రమంలో తొలిసారిగా సంతకం పెట్టి రాజకీయ నేతగా ప్రకటించుకున్నానని, ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయం సాక్షిగా మరోమారు రాజకీయ నేతగా గర్వంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనను చెన్నైలో కలిసినప్పుడు తన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరారని చెప్పారు.