సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ కజిన్ రిషికేశ్. రఘువరన్ బి.టెక్‌తో సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ధనుశ్ తమ్ముడి గా నటించిన రిషికేశ్ ఇప్పుడు బొమ్మల కొలువు చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం బొమ్మల కొలువు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో రిషికేశ్ మాట్లాడుతూ దర్శకుడు సుబ్బు డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెషల్ థాంక్స్. సినిమాలంటే ఉండే ప్యాషన్‌తో సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం అన్నారు.
నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి మాట్లాడుతూ పాండమిక్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నాతో `రాహు` సినిమా చేసిన సుబ్బుతో మాట్లాడితే, ఆయన సినిమా చేయడానికి రెడీ అన్నారు. అలా ఈ బొమ్మల కొలువు సినిమా స్టార్ట్ అయ్యింది. దాంతో పాటు మల్లాద్రి అప్పన్న దర్శకత్వంలో ఓ సినిమా, భానుశర్మ దర్శకత్వంలో మరో సినిమాను, ఈ సినిమాలను ఓకేసారి పూర్తి చేశాం. ఈ సినిమా విషయానికి వస్తే డిఫరెంట్ మూవీ. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ నెలలోనే ఈ మూడు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ పదేళ్ల ముందు నుంచి నాకు కోన వెంకట్, బి.వి.ఎస్.రవిగారితో మంచి అనుబంధం ఉంది. రాహు తర్వాత స్వామిగారితో సినిమా చేశాను. ఆయనకు థాంక్స్. త్వరలోనే సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.