'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్ర విడుదలకు నో.. వర్మకు తేరుకోలేని షాకిచ్చిన కోర్టు

బుధవారం, 11 డిశెంబరు 2019 (17:01 IST)
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే చిత్రం విడుదలకు హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పైగా, ఈ చిత్రం విడుదలకు హైకోర్టు నో చెప్పింది. అంతేకాకుండా, వివాదాస్పద డైలాగులు వచ్చిన చోటు మ్యూట్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పినా కోర్టు అంగీకరించలేదు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ చిత్రం ప్రివ్యూను ప్రిలిమినరీ కమిటీ చూసి, విడుదల సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
ప్రదర్శించడానికి వీలులేని సినిమా అంటూ ప్రధాన న్యాయమూర్తికి ప్రిలిమినరీ కమిటీ నివేదిక ఇచ్చింది. కొంతమంది వ్యక్తులను కించపరుస్తున్నట్టు సినిమా ఉందని పేర్కొంది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని రివైజ్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. 
 
ప్రిలిమినరీ కమిటీ అభ్యంతరాలను రివైజింగ్ కమిటీ సరిచేశాక మాత్రమే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. చేసిన సూచనలు సరిగ్గా లేకున్నా.. న్యాయం జరగలేదని అనిపించినా.. మరోసారి పిల్ వేయొచ్చని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
 
సినిమాపై అటు సెన్సార్ బోర్డు, ఇటు చిత్ర యూనిట్ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తీసేశామని కోర్టుకు చిత్ర బృందం తెలిపగా... అయితే అభ్యంతరకర సన్నివేశాలు తీసి వేసినట్టు ఎక్కడా లేదని... కేవలం మ్యూట్‌లో ఉంచారని మాత్రమే కౌంటర్‌లో పేర్కొన్నారని హైకోర్టు తెలిపింది.

మ్యూట్ చేస్తే సరిపోదని చిత్ర యూనిట్‌కు అక్షింతలు వేసింది. ఇదిలా ఉంటే.. నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ.. సినిమాకు సాయంత్రానికల్లా సర్టిఫికేట్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని.. అనుకున్న తేదీ ప్రకారమే డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు