ప్రభాస్ కి నేను డై హార్డ్ ఫ్యాన్ ని, పెదకాపు-1 తో రావడం హ్యాపీ గా ఉంది : హీరో విరాట్ కర్ణ
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:26 IST)
Hero Virat Karna
విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1. అఖండతో బ్లాక్‌బస్టర్ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో పెదకాపు-1 విశేషాలని పంచుకున్నారు.
సినిమాల పై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?
మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. కాలేజ్ పూర్తయిన తర్వాత జయ జానకీ నాయక చిత్రానికి ప్రొడక్షన్ సైడ్ పని చేశాను. అయితే నాకు నటన అంటే ఆసక్తి. ఒక ఏడాది తర్వాత ఒక షార్ట్ వీడియో చేసి మా బావ గారికి చూపించాను. అది ఆయనకి చాలా నచ్చింది. డైరెక్టర్ గారికి కూడా బాగా నచ్చింది. కొత్త కుర్రాడు ఐతే ఈ కథకు బాగా నప్పుతాడని అన్నారు. అలా ఈ సినిమా చేయడం జరిగింది.
నటనలో శిక్షణ తీసుకున్నారా ?
సత్యానంద్ గారి దగ్గర నాలుగు నెలల శిక్షణ తీసుకున్నాను.
మొదటిసారి హీరోగా నటించారు కదా ఎలా అనిపించింది ?
మొదటి రోజు షూట్ కి వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డాను. ఊరి నిండా జనాలు, సినిమా యూనిట్ అంతా వున్నారు. ఈశ్వరీరావు గారు మొదటి రోజు నుంచే నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను సెట్ కి వెళ్ళినపుడు చోటా గారు వచ్చి.. ట్విలైట్ షాట్ అరగంటలో అయిపోవాలిఅన్నారు. దీంతో ఇంకా కంగారుపడ్డాను. కొంచెం సమయం తీసుకున్నాను. ఒక రిహార్సల్ చేశాను. ఫైనల్ గా షాట్ చేసిన తర్వాత ఓకే అన్నారు. దీంతో కాస్త రిలాక్స్ అనిపించింది. ఆ రోజు మొత్తం యాక్షన్ సీనే జరిగింది. మొదటిరోజే పూర్తిగా ఓపెన్ అయి చేయాల్సిన సీన్. మొదటి రోజే షర్టు అంతా చిరిగిపోయి, కాళ్ళు చేతులు వాపులు వచ్చేశాయి (నవ్వుతూ)
సినిమా అంటే ఇంత కష్టమా అనిపించిందా ?
అనిపించింది. పెదకాపు లో యాక్షన్ అంతా నేచురల్ గా కావాలి. వీధిలో ఒక గొడవ జరిగితే ఎలా వుంటుందో అంత సహజంగా వుండాలి. ట్రైలర్ లో చూస్తే కూడా రా అండ్ రస్టిక్ గా వుంటుంది. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఈ సినిమాకి అన్ లిమిటెడ్ డేట్స్ ఇచ్చారు. అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. ఇందులో పని చేసిన అందరూ ఈ సినిమా తమకి రీబర్త్ లాంటిందనుకునే పని చేశారు.
మీ పరిచయ సినిమాకి పెదకాపు లాంటి ఇంటెన్స్ కంటెంట్ ని ఎంచుకోవడానికి స్ఫూర్తి ఏమిటి?
నేను చేసిన షార్ట్ వీడియో కూడా యాక్షన్ తరహాదే . అది చూసిన తర్వాత నేను మాస్ యాక్షన్ బాగా చేయగలనని శ్రీకాంత్ గారు భావించారు. శ్రీకాంత్ గారు ఒక ప్రేమకథతో పాటు పెదకాపు చెప్పారు. అందులో ఈ యాక్షన్ కథ ఐతే నాకు బావుంటుందనుకున్నారు. ఒక సామాన్యుడు అనేక సవాళ్ళని ఎదుర్కొని బలవంతుడితో పోరాడి ఎలా ఎదిగాడనేది పెదకాపు కథ. 1980లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినపుడు కూడా అందరూ కొత్తవాళ్ళని తీసుకున్నారు. అలా ఒక సామాన్యుడు ఎదిగిన క్రమాన్ని చూపించడానికి కొత్తవాడైతే బావుంటుందని ఈ సినిమా చేయడం జరిగింది.
మొదటి సినిమాలోనే ఇంత పరిణతి వున్న పాత్ర చేయడం ఎలా అనిపించింది?
ఈ సినిమా కోసం చాలా వర్క్ షాప్ చేశాం. రూరల్ లో ఎలా వుంటారు, ఎలా ప్రవర్తిస్తారు.. వీటన్నిటిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. లొకేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ మూడ్ క్రియేట్ అయి కథలోకి వెళ్ళిపోతాం, డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. ప్రతి సినిమాని ఇంతే కసిగా చేయాలనే పట్టుదల డైరెక్టర్ గారు నాలో గమనించారు. సినిమా చేస్తూ వెళుతుంటే ఇంకా బాగా వస్తుంది. అదే ఎక్సయిట్ మెంట్ తో ముందుకు వెళ్ళాం. అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది.
సత్యానంద్ గారు ప్రభాస్ గారితో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపించింది?
ప్రభాస్ గారికి నేను డై హార్డ్ ఫ్యాన్ ని. చిన్నప్పటినుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నపుడు ప్రభాస్ గారిపై నాకున్న ఇష్టాన్ని ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పక్కన ఉంటూ వింటుంటాను. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సత్యానంద్ గారు ప్రభాస్ గారితో మాట్లాడినట్లు కూడా నాకు ముందుగా చెప్పలేదు. నేరుగా వేదికపై చెప్పేసరికి చాలా అనందంగా అనిపించింది. ఒక అభిమానిగా చాలా సంతోషపడ్డాను. సినిమా విజయం తర్వాత ఆయన నుంచి ఏదైనా స్పందన వస్తే ఫీలింగ్ వేరే లెవల్ లో వుంటుంది.
నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళు ఐతే ఇంతపెద్ద కాన్వాస్ దొరికేదా ? మీపై ఇంత భారీగా ఖర్చుచేయడం భయం అనిపించిందా ?
నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి గారు కాకపొతే ఇంతపెద్ద కాన్వాస్ దొరికేది కాదు. సినిమా మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి నాపై ఇంత ఖర్చు చేస్తున్నారనేభయం వుండేది. ఆ భయంతోనే ఇంకా బాగా చేయగలిగాను. నిజానికి రవీందర్ రెడ్డి గారు ఈ సినిమా కథని నమ్మి తీశారు.
పెదకాపు పార్ట్ 2, 3 కూడా వుంటుందని అన్నారు. ఒక నటుడికి తొలిసినిమానే ఇలా రావడం ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంది. చివరి షూటింగ్ లో అందరూ ఎమోషనల్ గా ఫీలయ్యారు. అందరూ పాత్రలలో లీనమయ్యారు. అయితే పార్ట్ 2 వుంది కాబట్టి కాస్త రిలాక్స్ అయ్యాం. పెదకాపు ఒక లైఫ్ స్టొరీ. ఈ కథని పార్ట్స్ గా చేయొచ్చు.
స్క్రీన్ పై మిమ్మల్ని మీరు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది ?
మాటల్లో చెప్పలేని ఆనందం ఇది. చాలా రోజులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. అందులోనూ టీజర్ ట్రైలర్ ని అందరూ ప్రశంసించడం ఆనందం, తృప్తిని ఇచ్చింది.
అనసూయ తో మీకు కాంబినేషన్స్ వున్నాయి ?
వున్నాయండి. ఇందులో ఆమె చాలా బలమైన పాత్ర చేశారు. మా కాంబినేషన్ లో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు వున్నాయి.
మీ మొదటి సినిమాకి శ్రీకాంత్ అడ్డాల గారు దర్శకుడు అన్నప్పుడు ఎలా అనిపించింది ?
శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అన్నప్పుడు చాలా అనందంగా అనిపించింది. ఐతే నేను కొంచెం ఇంట్రోవర్ట్ ని. అంత త్వరగా ఏది బయటికి చెప్పను. మొదట్లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని దూరందూరంగా మాట్లాడేవాడిని. అయితే జర్నీ మొదలైన తర్వాత ఫ్రెండ్లీగా కలిసిపోయాం. ఫ్రెండ్లీ గా వుంటే అవుట్ పుట్ కూడా అద్భుతంగా వస్తుంది.
ఇందులో మీకు సవాల్ గా అనిపించిన సన్నివేశం ఏమిటి ?
ఒక ఎమోషనల్ సీన్ వుంది. చేయకముందు అది చాలా కష్టం ఏమో అనిపించింది. కానీ దాన్ని చాలా సులువుగా చేశాను. ఆ సీన్ చూసి పీటర్ హెయిన్స్ మాస్టర్.. నిన్ను గ్రేడ్ ఏ హీరోగా సర్టిఫై చేస్తున్నాఅన్నారు. అది విని పక్కనే వున్న రెడ్డిగారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని అలా చూడటం మొదటిసారి. అది చూసి చాలా ఆనందంగా అనిపించింది.
హీరోయిన్ ప్రగతి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
ముందుగా చెప్పినట్లు నేను చాలా ఇంట్రోవర్ట్. మొదట అంతగా మాట్లాడుకోవడం వుండేది కాదు. అయితే వర్క్ షాప్స్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెండ్లీ అయ్యాం. మా కెమిస్ట్రీ కూడా బాగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కొత్తవాళ్ళు చేసినట్లుగా అనిపించదు. ఇందులో ప్రేమకథ కూడా చాలా క్యూట్ గా వుంటుంది.
పెద్ద టెక్నిషియన్స్ అంతా సినిమాకి పని చేయడం ఎలా అనిపించింది?
చోటా కె నాయుడు గారు, మిక్కీ జే మేయర్ ఇలా టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నపుడు ఒక పక్క ఎక్సయిటింగా వుంటుంది మరో పక్క భయం కూడా వుంటుంది. నిజానికి ఈ సినిమాకి వాళ్ళు అంతా అవసరం. ఈ కథకు అంత మంచి టెక్నిషియన్స్ అవసరం.
రెండు రోజుల్లో సినిమా విడుదలౌతుంది ఎలా అనిపిస్తుంది ?
చాలా ఎక్సయిటింగా వుంది. అవుట్ పుట్ పై చాలా నమ్మకంగా వున్నాం. నిర్మాత చాలా అనందంగా వున్నారు. అయితే నటుడిగా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో, యాక్సప్ట్ చేస్తారా లేదా ? అనే భయం వుంది. అయితే ట్రైలర్ యాక్సప్ట్ చేశారు కాబట్టి సినిమా కూడా అంతే చక్కగా వుంటుంది, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.
ఈ సినిమా మీ ఫ్రండ్స్, పేరెంట్స్ కి చూపించినపుడు వారి రియాక్షన్ ఏమిటి ?
మా మదర్ , సిస్టర్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సినిమా అంటే ఎంత ఇష్టమో అర్ధమైయిందని అన్నారు. వాళ్లకి చాలా నచ్చింది.
భవిష్యత్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారు?
ప్రతి నటుడికి ఒక విష్ లిస్టు వుంటుంది. గౌతమ్ మీనన్ గారి తరహలో ఒక ప్యూర్ లవ్ స్టొరీ చేయాలని వుంది. అలాగే ఒక యాక్షన్ సినిమా, ఫ్యామిలీ డ్రామా కూడా చేయాలని వుంది. అయితే వెంటనే పెదకాపు 2 మొదలుపెడుతున్నాం. ఈ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాను.