నితిన్ లేక‌పోతే ‘చెక్‌’ లేదుః ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్‌ యేలేటి

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (06:34 IST)
Sai chand, nitin, priya
‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్‌’ సినిమా ఇతివృత్తం. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని దాని మీద పని చేశా. సెకెండాఫ్‌ వర్కవుట్‌ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు. కల్యాణి మాలిక్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది’’ అని ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్‌ యేలేటి అన్నారు. 
 
నితిన్‌ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై  వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ కథానాయిక కాగా, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియిర్‌ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ద‌ర్శ‌కుడు మాట్లాడారు.
 
అనంత‌రం నితిన్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌ గ్రాఫ్‌లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్‌ జానర్‌ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ తరహా యునీక్‌ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్‌ ఏలేటి చెప్పిన 15 నిమిషాల కథ విని వెంటనే అంగీకరించా. కథలో ఓ పాయింట్‌ ఫ్రెష్‌ ఉంది. నాకు చాలా కొత్త కథ ఇది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ‘చెక్‌’ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. అవుట్‌పుట్‌ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. నిర్మాతకు పేరుతోపాటు మంచి వసూళ్లు తెచ్చే చిత్రమిది’’ అని అన్నారు. 
 
నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఓటీటీ వేదికగా ‘ఓ పిట్ట కథ’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రాలు విడుదల చేసిన సక్సెస్‌ అయ్యాం. ‘చెక్‌’ సినిమాతో మా సంస్థ మరో మెట్టు ఎక్కుతుంది. ఇప్పటి వరకూ నితిన్‌ని లవర్‌ బాయ్‌గా చూశాం. ఈ చిత్రంతో ఎప్పుడూ చేయని ఓ పాత్ర పోషించారు. సినిమా చూశాక అతని నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. చంద్రశేఖర్‌ ఏలేటి నాకెంతో ఇష్టమైన దర్శకుడు. ఆయన ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. ఇందులో నటీనటులు కనిపించరు. వారు పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం కోసం ప్రాణం పెట్టి పని చేశారు. మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. దర్శకుడికి ఈసారి మంచి కమర్షియల్‌ సక్సెస్‌ వస్తుంది’’ అని అన్నారు. 
 
సాయిచంద్‌ మాటాడుతూ ‘‘ఫిదా’, ‘సైరా’, ‘ఉప్పెన’ లాంటి అనూహ్య విజయాల తర్వాత నేను నటించిన మరో మంచి చిత్రమిది. నసీరుద్దీన్‌ షాను అనుకొని ఆ స్థానంలో నన్ను నటుడిగా తీసుకోవడం ఆనందంగానూ. పద్మా అవార్డ్‌ అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అని చెప్పారు. 
 
సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్‌ మాట్లాడుతూ ‘‘నితిన్‌కు పది సినిమాలు చేస్తే వచ్చిన గుర్తింపు ఈ సినిమాతో వస్తుంది. అంత మంచి కథ. తన నటన కూడా అలాగే ఉంటుంది. ఆర్‌ ఆర్‌ చేస్తున్న సమయంలో తన నటన చూసి మురిసిపోయేవాణ్ణి. వాటిని స్ర్కీన్‌ షాట్‌ తీసి నితిన్‌కి పంపేవాణ్ణి’’ అని అన్నారు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, అన్నే రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు