కొన్ని సందర్భాల్లో మాట్లాడలేం.. కన్నీళ్ళు మాత్రమే వస్తాయి... జూ.ఎన్టీఆర్

ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (16:18 IST)
''మాట్లాడటానికి మాటల్లేవ్‌, అనుభూతులు మాత్రమే మిగిలున్నాయి. కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడలేం, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి, అలాంటి గొప్ప అనుభూతినిచ్చిన దర్శకుడు కొరటాల శివకి ధన్యవాదాలు. ఇక్కడొక విషయం చెప్పాలి... సెప్టెంబర్‌ 1న 'జనతా గ్యారేజ్‌' సినిమా విడుదలైంది. సెప్టెంబర్‌ 2న మా అమ్మనాన్నల పుట్టినరోజు. గత పన్నెండేళ్ళుగా నా తపనను నా తల్లిదండ్రులకు తెలియజేయాలని సంకల్పాన్ని 'జనతా గ్యారేజ్‌' రూపంలో కొరటాల శివ కల్పించారు. నాకు 'జనతా గ్యారేజ్‌' రూపంలో ఓ వెలుగు కనపడుతుందని ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. అలా నేను నమ్మిన వెలుగును నాకు అందించిన ఆడియెన్స్‌ను శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ విజయాన్ని ఎప్పటికీ మరచిపోలేను అని ఎన్టీఆర్ అన్నారు. 
 
ఎన్టీఆర్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ... నాకు వచ్చిన అన్నీ విజయాలకంటే ఈ విజయాన్ని నా గుండె దగ్గరగా పెట్టుకుంటాను. అలాగే ఇంకా బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. ఇక నేను, సమంత కలిసి చేసిన నాలుగో సినిమా ఇది. 
 
మా కాంబినేషన్‌ 'బృందావనం' తర్వాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ సాధించలేకపోయాయి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఇందులో సమంత హీరోయిన్‌ అయితే బావుండేదనిపించింది. నా మనసులో మాట కొరటాల శివకి తెలిసిందేమో ఈ సినిమలో నిజంగానే ఆయన సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారు. మా కాంబినేషన్‌లో పెద్ద సక్సెస్‌ అయిన సినిమాగా నిలిచిపోయింది. 
 
అలాగే బ్రహ్మాజీ, అజయ్‌, బెనర్జీ ఈ సినిమాలో ఆరుగురు మాకు అందించిన బలాన్ని మరచిపోలేను. ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ అందించిన సపోర్ట్‌ను మరచిపోలేం. రాజీవ్‌ కనకాలతో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన జి.హెచ్‌.ఎం.సి సీన్‌ సూపర్బ్‌గా వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మా కలయికలో వచ్చిన సక్సెస్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు కొరటాల శివ సన్నివేశాలను ఎంత అందంగా చూపించినా, ఆ సన్నివేశానికి తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను అందించిన దేవిశ్రీప్రసాద్‌ సినిమాకు పరిపూర్ణమైన సంగీతాన్ని అందించాడు. 
 
మోహన్‌లాల్‌ పక్కన నటించేంత అనుభవం, అర్హతలేని వ్యక్తిని నేను. కానీ ఆయన నన్ను ఓ కొడుకులా, శిష్యుడిలా భావించారు. ఆయనతో ఈ సినిమా సమయంలో చేసిన జర్నీ నాలోని ఎన్నో కొత్త కోణాలను చూశాను. నిర్మాతలను నేను జాన్‌, జానీ, జనార్ధన్‌ అని పిలుచుకుంటూ ఉంటాను. సినిమా ఇంత బాగా రావడానికి వారే కాణం. వారింకా ఎన్నో గొప్ప చిత్రాలు తీయాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. 
 
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ''జనతా గ్యారేజ్‌ నాకు చాలా స్పెషల్‌ మూవీ. ఎన్టీఆర్‌ను నేను అన్న అని అంటుంటాను. కానీ వయసులో చాలా చిన్న వ్యక్తి. ఈ కథ వినగానే ఎక్కువగా థ్రిల్‌ అయ్యి మా అందరికీ కంటే సినిమా కథ చేయడానికి చాలా ఎగ్జైట్‌ అయ్యారు. అలాగే దేవిశ్రీప్రసాద్‌ కూడా అలాగే సినిమా గుంచి నమ్మాడు. అందుకే ఇంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మోహన్‌లాల్‌ పాత్రలో ఒదిగిపోయి నటించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి