మీ వినతి చాలా గౌరవప్రదమైనది.. సీఎం జగన్‌కు కమల్ అభినందన

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (13:18 IST)
ఇటీవల కన్నుమూసిన గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. దీనిపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. మీ వినతి చాలా గౌరవప్రదమైనది సీఎం జగన్ గారూ అంటూ వ్యాఖ్యానించారు. 
 
మీ విన్నపం పట్ల తమిళనాడులోనేకాకుండా దేశమంతా ఉన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భారతరత్నకు బాలు అన్ని విధాలా అర్హులని... రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి మీరు లేఖ రాయడం సంతోషకరమన్నారు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు.
 
కాగా, ఐదు దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులను తన సుమధురగానంతో అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25వ తేదీ శుక్రవారం శాశ్వతనిద్రలోకి జారుకున్న విషయం తెల్సిందే. తన జీవిత కాలంలో 16 భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలను పాడారు. ప్రపంచంలో ఇన్ని పాటలను మరెవరూ పాడలేదు. 
 
తన ప్రయాణంలో బాలు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలను కూడా పొందారు. అలాంటి గానగంధర్వుడుకి భారతరత్న పురస్కారం ఇవ్వడం గౌరవప్రదంగా ఉంటుందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు